విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీస్ స్టేషన్లో వైసీపీ మద్దతురాలు శ్రీరెడ్డి(Sri Reddy) విచారణకు హాజరయ్యారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్‌పై అసభ్యకర వీడియోలు పెట్టిన కేసులో ఆమెను పోలీసులు ప్రశ్నించారు. సుమారు 2 గంటల పాటు శ్రీరెడ్డిని విచారించిన పోలీసులు 41ఏ నోటీసులు ఇచ్చి పంపించారు.
కాగా వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో శ్రీరెడ్డి బూతులతో రెచ్చిపోయిందని కూటమి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ టార్గెట్‌గా అసభ్యకర పోస్టులు పెట్టారంటూ గత ఏడాది నవంబర్ 13న నెల్లమర్లకు చెందిన కౌన్సిలర్ కళావతి నెల్లమర్ల పోలీస్ స్టేషన్లో శ్రీరెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు తమిళనాడులో ఉంటున్న శ్రీరెడ్డికి విచారణకు హాజరుకావాలంటూ స్వయంగా నోటీసులు అందజేశారు. ఈ నేపథ్యంలో విచారణకు హాజరైన ఆమెకు 41ఏ నోటీసులు ఇచ్చారు. అవసరమైతే మళ్లీ విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.