*రాయచోటిలో దాడులు ఆపండి..
* కూటమి ప్రభుత్వంపై గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజం
రాయచోటి,తెలుగు ప్రభ :స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాయచోటిలో చోటుచేసుకుంటున్న ఘటనలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రతిపక్షాలపై దాడులు, బెదిరింపులకు పాల్పడుతూ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్నారని కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. శనివారం రామాపురంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.రాయచోటిలో వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై దాడి, నిప్పంటించడం, వాహనాలు ధ్వంసం చేయడం, వ్యాపార సంస్థలు, గోడౌన్లు, దుకాణాలపై దాడులు వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రజలకు ఉపయోగపడే వాటర్ ప్లాంట్లను సైతం ధ్వంసం చేశారని విమర్శించారు. ఈ ఘటనలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాయచోటి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా జిన్నా షరీఫ్‌ను తమ పార్టీ ఎంపిక చేసిందని తెలిపారు. ఆయనకు, కుటుంబ సభ్యులకు భద్రతాపరమైన ఆందోళనలు ఉండటంతో ప్రైవేట్ గన్‌మెన్‌లను నియమించుకున్నారని వివరించారు. భద్రత కోసం తీసుకున్న చర్యలను కుట్రగా చిత్రీకరించడం సరికాదన్నారు. బీహార్ గ్యాంగ్‌లతో వైఎస్సార్‌సీపీకి సంబంధాలున్నాయన్న ఆరోపణలను ఖండిస్తూ, ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
ప్రజల మద్దతుపై నమ్మకం ఉంటే ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎదుర్కోవాలని కూటమి నేతలకు సవాల్ విసిరారు. ప్రతిపక్ష అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డంకులు సృష్టించకూడదని, అవసరమైన ధ్రువపత్రాలను సకాలంలో అందించాలని కోరారు. తమ పార్టీ తరఫున 44 మంది కౌన్సిలర్ అభ్యర్థులతో పాటు చైర్మన్ అభ్యర్థి నామినేషన్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.తాను ఎన్నికల ప్రచారానికి రానని, అధికార పార్టీ నేతలు కూడా ప్రచారానికి రాకుండా అభ్యర్థులను స్వేచ్ఛగా పోటీ చేయనివ్వాలని ప్రతిపాదించారు. పోలీసుల పర్యవేక్షణలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించి ప్రజాతీర్పును గౌరవించాలని కోరారు.
రాయచోటికి జిల్లా కేంద్రాన్ని తిరిగి తీసుకురావాలని శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రం కోల్పోవడం ఈ ప్రాంత ప్రజలకు సంబంధించిన ముఖ్యమైన సమస్య అని, దానిపై ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉందన్నారు. రాయచోటి అభివృద్ధి, రైతుల సమస్యల పరిష్కారం, యువతకు మెరుగైన భవిష్యత్తు కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి దాడులు, బెదిరింపులు జరగకుండా పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. ఘటనలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను గుర్తించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, రాయచోటి అభివృద్ధి కోసం తమ పోరాటం కొనసాగుతుందని గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.

