శ్రీశైలం పాదయాత్ర వెళ్లే భక్తుల నుండి అటవీశాఖ ఆర్థిక దోపిడిని వెంటనే ప్రభుత్వం ఆపాలని విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు బసవన్న గౌడ్, బజరంగ్ దళ్ జిల్లా ప్రముఖ్ రవిశంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదోని సబ్ కలెక్టర్ శివ నారాయణ శర్మకు వినతిపత్రం అందించారు.
పాదయాత్ర భక్తులను ఇబ్బంది పెట్టద్దు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం దేవస్థానంకు 15 రోజుల ముందు నుంచి భక్తులు పాదయాత్ర చేయడం తరతరాలుగా వస్తున్న సాంప్రదాయమన్నారు. పాదయాత్ర చేస్తున్న భక్తుల నుంచి నల్లమల అటవీశాఖ అధికారులు నూతనంగా పర్యావరణ నిర్వహణ పేరుతో ప్రతి భక్తుల నుంచి 10 రూపాయలు వసూలు చేయడం సరైన పద్ధతి కాదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం హిందూ సాంప్రదాయాలను, హిందూ పండుగను దృష్టిలో ఉంచుకొని ఒకవైపు అదనపు చార్జీల పేరుతో మరోవైపు దేవాదాయ శాఖ తరపున హుండీలో వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాను నింపుకోవడమో కాక, హిందూ ఇతర సంస్థల నుంచి ఏ ఒక్క రూపాయి తీసుకోకుండా ఈసారి కొత్తగా పాదయాత్ర చేస్తున్న యాత్రికుల నుంచి సొమ్ము వసూలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు.
లేదంటే ఉద్యమమే..
అటవీశాఖ నిర్ణయం వెంటనే ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లక్షలాది మంది భక్తులు మనోభావాలను దృష్టిలో ఉంచుకొని ఇలాంటి దుశ్చర్యకు పాల్పడడం వలన హిందూ మనోభావాలు దెబ్బతింటే భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం అధికార పార్టీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ నాయకులు జిల్లా కార్యదర్శి హనుమంత్ రెడ్డి, పట్టణ వి హెచ్ పి అధ్యక్షులు ఈరన్న రావు, జిల్లా కోశాధికారి పంపాపతి, నగర ఉపాధ్యక్షులు చెన్న బసప్ప, శివ స్వాములు గురు స్వామి శైలేంద్ర స్వామి, అశోక్ స్వామి, శివ స్వాములు విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు పాల్గొన్నారు.