Stampede while boarding a bus: సంక్రాంతి పండుగ పూర్తి కావడంతో సొంతూళ్లకు వెళ్లిన వారందరూ తిరిగి నగరబాట పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే బస్సులు, రైళ్లు కిటకిటలాడుతున్నాయి. బస్సుల్లో, రైళ్లల్లో తీవ్ర రద్దీ నెలకొంది. ఇక ఏపీలో మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం అమల్లో ఉండటంతో ఎక్కువ మంది ఆర్టీసీ బస్సులవైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే పల్నాడు జిల్లా వినుకొండలో ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు ఎక్కేందుకు మహిళలు ఒకరినొకరు తోసుకుంటూ పోటీపడటంతో తొక్కిసలాట జరిగి నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వినుకొండ ఆర్టీసీ బస్టాండ్ గ్యారేజ్ వద్ద ఈ ఘటన జరిగింది. సంక్రాంతి పండుగ సెలవులు పూర్తవ్వడంతో తిరుగు ప్రయాణాలతో బస్టాండ్‌లో భారీ రద్దీ నెలకొంది. ఈ క్రమంలోనే వినుకొండ బస్టాండ్‌లో విజయవాడ బస్సు ఎక్కే సమయంలో ప్రయాణికుల మధ్య తోపులాట జరిగింది. కొంతమంది కింద పడిపోవడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలో నలుగురు తీవ్రంగా గాయాలపాలయ్యారు.
డ్రైవర్‌కు ఫిట్స్.. బస్సు బోల్తా పడి ఏడుగురికి గాయాలు
మరో బస్సు ప్రమాద ఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు ఫిట్స్ రావటంతో బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. గరివిడి మండలంలోని అప్పన్నవలస వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాద ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఏడుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. రాజాం నుంచి విజయనగరం వెళ్తున్న పల్లెవెలుగు బస్సు డ్రైవర్‌కు అప్పన్నవలస వద్దకు రాగానే ఒక్కసారిగా ఫిట్స్ వచ్చింది. దీంతో డ్రైవర్ బస్సు మీద కంట్రోల్ తప్పిపోయాడు. ఫలితంగా ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. అనంతరం అక్కడికక్కడే బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు తీవ్ర గాయాలపాలవ్వగా.. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్, కండక్టర్‌తో పాటు 87 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు బోల్తాతో తీవ్ర గాయాలపాలైన ఆర్టీసీ బస్సు డ్రైవర్ అప్పల గురువులు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. బస్సు ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

