Student diet charges hiked by CM Chandrababu: విద్య ద్వారానే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల జీవితాల్లో మార్పు వస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో చదువుతున్న బీసీ, ఎస్టీ, ఎస్సీ విద్యార్థుల డైట్ ఛార్జీలను 10 శాతం మేర పెంచాలని అధికారులను ఆదేశించారు. వెంటనే ఈ పెంపు వర్తింపజేయాలని కీలక ప్రకటన చేశారు. ఇవాళ (బుధవారం) రాష్ట్ర సచివాలయంలో సంక్షేమ శాఖలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. సంక్షేమ హాస్టళ్లలో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం, వసతి అందించాలని, రాష్ట్రంలో పెద్ద ఎత్తున గురుకులాల నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
Also Read: Trump: ఇరాన్ తీరు బాగోలేదు.. ఈ రాత్రి బాంబుల వర్షం కురిపిస్తాం.. ట్రంప్ మాస్ వార్నింగ్
కార్పొరేట్‌కు ధీటుగా ప్రభుత్వ విద్యాసంస్థలు..
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ విద్యా సంస్థలను, గురుకులాలను కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలకు ధీటుగా తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా రాష్ట్రంలోని అన్ని రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్ల మెయింటెనెన్స్ కోసం రూ.100 కోట్ల గ్రాంట్ కేటాయిస్తున్నట్లు చెప్పారు. పేదలకు సంక్షేమం అందించడమే కాకుండా, వారి జీవనోపాధిని మెరుగుపరిచి మరింత ఆదాయం సమకూర్చేలా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అందించే సంక్షేమం, మెప్మా, డ్వాక్రా పథకాల ద్వారా ఉపాధి కల్పించడంతో పాటు పీ4 ద్వారా సాయం అందించాలని ఆదేశించారు. వ్యవసాయం, ఉద్యాన రంగం, పాడి పరిశ్రమ, జీ రామ్ జీ లాంటి వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మేలు చేకూర్చాలని కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు డోలా బాలవీరాంజనేయ స్వామి, సవిత, గుమ్మడి సంధ్యారాణి, ఎన్ఎండీ ఫరూక్, మైనార్టీ సంక్షేమ సలహాదారు మహ్మద్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.

