Sugali Preethi : కర్నూలు జిల్లాకు చెందిన సుగాలి ప్రీతి హత్య కేసు మళ్లీ వార్తల్లోకి వచ్చింది. 2017 ఆగస్టులో జరిగిన ఈ ఘటనలో ప్రీతిని అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపణలు ఉన్నాయి. ప్రీతి తల్లి పార్వతి ఇటీవల పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉండి కేసును హైలైట్ చేసిన పవన్, ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత సైలెంట్‌గా ఉన్నారని, కేసును పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై జనసేన పార్టీ ఘాటుగా స్పందించింది. పవన్ కల్యాణ్ లేకపోతే ఈ కేసు ఎప్పుడో మరుగున పడిపోయేదని, ఆయనే దీన్ని వెలుగులోకి తెచ్చారని పేర్కొంది.
ALSO READ: Holidays: తెలంగాణ విద్యార్థులకు అదిరిపోయే వార్త..వరుసగా రెండు రోజులు సెలవులు..రేపటి నుంచే..!
2019 డిసెంబర్‌లో ప్రీతి తల్లిదండ్రులు జనసేన కార్యాలయానికి వచ్చి మొరపెట్టుకున్నారు. అప్పటి వైసీపీ ప్రభుత్వంపై పవన్ ఒత్తిడి తెచ్చారు. 2020 ఫిబ్రవరి 12న కర్నూలులో ‘ర్యాలీ ఫర్ జస్టిస్’ నిర్వహించారు. ఆ సభలో పార్వతి మాట్లాడుతూ పవన్‌ను ప్రశంసించారు. పవన్ ఒత్తిడి వల్లే 2020 ఫిబ్రవరి 27న వైసీపీ ప్రభుత్వం కేసును సీబీఐకి అప్పగించింది. అయితే, జీవో ఇచ్చి చేతులు దులుపుకున్నారని, విచారణ ముందుకు సాగలేదని జనసేన ఆరోపిస్తోంది.
అధికారంలోకి వచ్చాక కూడా పవన్ కేసును మరచిపోలేదు. డిప్యూటీ సీఎం అయిన వెంటనే ప్రీతి తల్లిదండ్రులను క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడారు. విచారణ వేగవంతం చేయాలని హోం మంత్రి అనితకు సూచించారు. ఇటీవల ‘సేనతో సేనాని’ సభలో పవన్ మాట్లాడుతూ, కేసుపై తన స్టాండ్‌ను స్పష్టం చేశారు. సాయం చేసిన వారు కృతజ్ఞత మరచడం తప్పని జనసేన వ్యాఖ్యానించింది. ఈ కేసు 2017లో టీడీపీ పాలనలో జరిగినప్పటికీ, పవన్ ఎప్పుడూ టీడీపీని బ్లేమ్ చేయలేదు. ఇప్పుడు సీబీఐ విచారణలో పురోగతి లేకపోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. పవన్ చొరవతోనే కేసు ఇంతవరకు వచ్చిందని, ఆయనపై ఆరోపణలు సరికాదని జనసేన అంటోంది. ఈ వివాదం రాజకీయ రంగు పులుముకుంటోంది.


