మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో(Viveka Murder Case) మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు(Supreme Court)లో అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ అఫిడవిట్‌లో కొన్ని కీలకమైన విషయాలను వెల్లడించింది. వివేకా పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదుపై జరిపిన దర్యాప్తు విషయాలతో విచారణాధికారి పులివెందుల కోర్టుకు ఇచ్చిన నివేదికను జతచేసి సర్వోన్నత న్యాయస్థానంలో అఫిడవిట్ వేసింది.
వివేకా హత్య కేసును తప్పుదోవ పట్టించేందుకు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ప్రయత్నించారని పేర్కొంది. వివేకా కుమార్తె సునీతారెడ్డి, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డిని ఈ కేసులో ఇరికించాలని చూశారని తెలిపింది. ఇందులో భాగంగానే సీబీఐ అధికారి రామ్‌సింగ్, సునీత, రాజశేఖర్‌రెడ్డిపై కేసు నమోదు చేశారని అఫిడవిట్‌లో పొందుపరిచింది. కాగా వివేకా హత్య కేసుకు సంబంధించి ఆయన కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి ఇటీవల మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.