Utsav exhibition: ఉత్సవ్ నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉత్సవ్ వివాదంలో ఏపీ ప్రభుత్వానికి సానుకూల తీర్పును ఇచ్చింది. పిటీషనర్ అభ్యంతరాలను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.
అసలేం జరిగిందంటే: విజయవాడ ఉత్సవ్ పేరుతో కృష్ణానది తీరంలో భారీ ఈవెంట్స్, ఎగ్జిబిషన్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. అయితే ఏపీ హైకోర్టు.. విజయవాడ సమీపంలోని గొల్లపూడిలో గొడుగుపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానికి సంబంధించిన దేవాదాయ భూముల్లో విజయవాడ ఉత్సవ్ నిర్వహించడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు.. దేవాదాయ భూములను వాణిజ్య అవసరాలకు ఉపయోగించవద్దని ఆదేశాలను జారీ చేసింది. వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు ఎలా ఉపయోగిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దేవాదాయ భూముల్లో ఎగ్జిబిషన్ నిర్వహణ కోసం వేసిన మట్టి, కంకరలను వెంటనే తొలగించాలని ఆదేశాలు ఇచ్చింది. అంతేకాదు ఆ భూములను యథాస్థితికి తీసుకు రావాలని ఆదేశించింది.
హైకోర్టు తీర్పును తోసిపుచ్చిన సుప్రీంకోర్టు: అయితే ఇదే అంశంలో ఏపీ ప్రభుత్వానికి సానుకూల తీర్పును సుప్రీంకోర్టు ఇచ్చింది. పిటీషనర్ అభ్యంతరాలను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. దీంతో నేటి నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు 11 రోజుల పాటు గొడుగుపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానికి సంబంధించిన దేవాదాయ భూముల్లో ఎగ్జిబిషన్ జరుగనుంది.


