ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు(Raghu Rama Krishna Raju) కస్టోడియల్ టార్చర్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తప్పుడు మెడికల్ రిపోర్ట్ ఇచ్చినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ పద్మావతి సీఐడీ విచారణకు హాజరుకావాల్సిందేనని ఆదేశించింది. ఈనెల 7, 8 తేదీల్లో ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. విచారణకు సహకరించకపోతే ముందస్తు బెయిల్ రద్దు అవుతుందని హెచ్చరించింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 15కి వాయిదా వేసింది.
RRR కస్టోడియల్ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో పద్మావతి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆమె పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. మధ్యంతర రక్షణ కల్పిస్తూ విచారణకు హాజరుకావాలని సూచించింది. అయితే ఆమె విచారణకు హాజరుకావడం లేదని ఆమెకు గతంలో ఇచ్చిన ముందస్తు బెయిల్ తొలగించాలని ప్రభుత్వం తరపు న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు విచారణకు తప్పకుండా హాజరుకావాలని ఆదేశించింది.