Pinnelli Brothers Bail Petition Supreme Court: టీడీపీ నేతల జంట హత్యల కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వారు దాఖలు చేసిన రెండు పిటిషన్లను కొట్టివేయడంతో పాటు.. గతంలో ఇచ్చిన తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. హత్య కేసులో పిన్నెల్లి సోదరులకు ముందస్తు బెయిల్‌కు అర్హత లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ రోజు విచారణ చేపట్టింది.
పిన్నెల్లి సోదరులు విచారణకు సహకరించలేదని.. సుప్రీంకోర్టు చెప్పినా ఆదేశాలు పాటించకుండా సాక్షులను బెదిరించారని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులో సుప్రీంకోర్టుకు వివరించారు. సాక్ష్యాలను ట్యాంపరింగ్ చేసే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. ఈ మేరకు వాదనలు విన్న ధర్మాసనం.. ఇద్దరిని చంపిన కేసులో పిన్నెల్లి సోదరులను అరెస్ట్ చేసేందుకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని ధర్మాసనం వెల్లడించింది. దీంతో పిన్నెల్లి సోదరులు సరెండర్ కావడానికి రెండు వారాల సమయం ఇవ్వాలని వారి తరపు లాయర్లు న్యాయస్థానాన్ని కోరారు.
ముందస్తు బెయిల్ విషయంలో సమయం ఎలా ఇస్తారన్న జస్టిస్ మెహతా.. కేసు దర్యాప్తులో నిందితులకు పోలీసుల నుంచి పూర్తి సహకారం అందుతోందని అభిప్రాయపడ్డారు. సెక్షన్ 161 కింద నమోదు చేసిన డాక్యుమెంట్లు నిందితులకు ఎలా అందాయని ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో కస్టోడియల్ దర్యాప్తు తప్పనిసరి అని స్పష్టం చేసింది. కాగా, పోలీసులే తమకు 161 స్టేట్‌మెంట్ ఇచ్చారని సుప్రీంకోర్టుకు పిన్నెల్లి తరపు న్యాయవాదులు వివరించగా.. ఏపీ పోలీసుల వ్యవహార తీరుపై ధర్మాసనం మండిపడింది. చివరకు పిన్నెల్లి సోదరులు లొంగిపోయేందుకు రెండు వారాల సమయాన్ని సుప్రీం కోర్టు ఇచ్చింది.
Also Read: https://teluguprabha.net/health-fitness/probiotic-drinks-gut-health-benefits-guide/
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ నాయకులు జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరావు హత్యల కేసులో ఏ1 గా జవిశెట్టి శ్రీను, ఏ2గా తోట వెంకట్రావు, ఏ3గా తోట గురవయ్య, ఏ4 గా నాగరాజు, ఏ5 గా తోట వెంకటేశ్వర్లు, ఏ6గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఏ7గా పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిని నిందితులుగా ఉన్నారు. ఈ క్రమంలో పిన్నెల్లి సోదరుల ముందస్తు బెయిల్ పిటీషన్‌ను హైకోర్టు గతంలో కొట్టివేసింది. ఈ తీర్పును పిన్నెల్లి సోదరులు సుప్రీంలో సవాలు చేయగా.. వారిద్దరికీ మధ్యంతర రక్షణ కల్పించింది. పిన్నెల్లి సోదరుల ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తుది నిర్ణయం వెలువడే వరకు వారిని అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. ఈ మేరకు నేడు విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం.. పిన్నెల్లి సోదరుల ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయడంతో పాటు మధ్యంతర రక్షణ ఉత్తర్వులను కూడా రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

