YS Jagan| ఏపీ మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయడంతో పాటు బెయిల్ రద్దు చేయాలని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు(Supreme Court)లో విచారణ జరిగింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ అభయ్ ఓకా, పంకజ్ మిట్టల్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. జగన్ కేసుల విచారణలో జాప్యంపై సుప్రీంలో సీబీఐ, ఈడీ అఫిడవిట్ దాఖలు చేశాయి. ఈ నివేదికలను పరిశీలించిన తరువాత తీర్పు ఇస్తామని ధర్మాసనం తెలిపింది. అనంతరం తదుపరి విచారణను జనవరి 10కి సుప్రీం ధర్మాసనం వాయిదా వేసింది.
ఈ పిటిషన్‌పై గతంలో విచారణ జరిపిన ధర్మాసనం జగన్ కేసుల విచారణలో ఎందుకు జాప్యం జరుగుతుందని గతంలో ప్రశ్నించింది. కేసుల స్టేటస్‌ను వివరిస్తూ నివేదిక ఇవ్వాలని సీబీఐ, ఈడీలను ఆదేశించింది. సుప్రీం ఆదేశాల మేరకు ఈరోజు నివేదికలను దాఖలు చేశాయి. దీంతో జనవరి 10న తుది తీర్పు ఇస్తామని ధర్మాసనం ప్రకటించిన నేపథ్యంలో వైసీపీ శ్రేణుల్లో టెన్షన్ మొదలైంది. సంక్రాంతి పండుగ తర్వాత జిల్లాల పర్యటన చేయాలని జగన్ భావిస్తున్నారు. ఒకవేళ బెయిల్ రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే పరిస్థితి ఏంటనే ఉత్కంఠ ఆ పార్టీ నేతలను కలవరపెడుతోంది.