పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ(SVSN Varma) మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి నారా లోకేశ్(Nara Lokesh)టీడీపీ పగ్గాలు అప్పగించాలని డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన ప్రజాదర్బార్‌లో ఆయన మాట్లాడుతూ… పార్టీకి లోకేశ్ నాయకత్వం ఎంతో అవసరమని తెలిపారు. లోకేశ్‌ను తెలుగుదేశం పార్టీ రథసారథిగా నియమించాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. యువగళం పాదయాత్రతో పార్టీ శ్రేణుల్లో లోకేశ్ నూతనోత్సాహం నింపారని.. ఆయన పాదయాత్ర పార్టీ విజయానికి దోహదం చేసిందని వర్మ అభిప్రాయపడ్డారు. లోకేశ్ నాయకత్వానికి పార్టీ కార్యకర్తలు సంపూర్ణ మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు.
కాగా ఇటీవల లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలని వర్మ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా టీడీపీ పగ్గాలు అప్పగించాలని కోరడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం లోకేశ్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శితో పాటు మంత్రిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.