Donations to TDP, Janasena, YCP: ఆంధ్రప్రదేశ్‌లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలకు అందిన విరాళాల వివరాలు వెల్లడయ్యాయి. ఈ విరాళాల్లో అత్యధికంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అందుకోగా.. రెండో స్థానంలో టీడీపీ, మూడో స్థానంలో జనసేన పార్టీ ఉంది. ఇంతకీ మరి ఒక్కో పార్టీకి ఎంత మేర డొనేషన్లు వచ్చాయి.? పూర్తి వివరాలు ఈ కథనంలో..
ఏపీలో గత ఆర్థిక సంవత్సరంలో రాజకీయ పార్టీలకు అందిన విరాళాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నివేదిక విడుదల చేసింది. తెలుగుదేశం పార్టీకి రూ. 83 కోట్లు అందగా.. జనసేనకు రూ. 25.33 కోట్లు డొనేషన్లు సమకూరాయి. అత్యధికంగా వైసీపీకి రూ. 140.03 కోట్లు విరాళాలు వచ్చాయని తెలిపింది.
టీడీపీకి సమకూరిన డొనేషన్ల వివరాల నివేదికను పార్టీ ప్రధాన కార్యదర్శి బక్కని నరసింహులు కేంద్ర ఎన్నికల సంఘానికి అందించారు. మొత్తం 267 మంది దాతలు టీడీపీకి ఆర్థిక సహకారం అందించినట్లు తెలిపారు. అయితే 2023- 24 ఆర్థిక సంవత్సరంలో టీడీపీకి వచ్చిన విరాళాలతో పోలిస్తే, 2024-25లో సుమారు రూ. 17.15 కోట్లు తగ్గినట్లుగా నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ఎన్డీఏ ప్రభుత్వంలోని మిత్రపక్షాలైన టీడీపీ, జనసేన పార్టీలకు నాట్కో ఫార్మా ప్రధాన దాతల్లో ఒకటిగా ఉంది. టీడీపీకి రూ. 7 కోట్లు, జనసేనకు రూ. 1.5 కోట్లు విరాళంగా అందించింది. ఇక 2023-24లో టీడీపీకి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ. 33 కోట్లు అందగా, ఆ ఆర్థిక సంవత్సరంలో మొత్తం విరాళాలు రూ. 100 కోట్లకు పైగా సమకూరాయి.
Also Read: https://teluguprabha.net/telangana-news/dr-ramesh-reddy-incharge-vc-kaloji-health-university/
2024- 25 ఆర్థిక సంవత్సరంలో వైసీపీకి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ. 113 కోట్లు అందాయి. నాట్కో ఫార్మా వైసీపీకి రూ. 10 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు నివేదికలు పేర్కొన్నాయి. మొత్తం 37 మంది దాతల నుంచి విరాళాలు అందగా.. పలు కంపెనీల నుంచి ఈ విరాళాలు వచ్చినట్లు సమాచారం.
ఇక తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు 2024- 25లో రూ. 15.09 కోట్ల విరాళాలు అందినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఎంఐఎం పార్టీకి.. రూ.20 వేలకు మించి ఎలాంటి విరాళాలు రాలేదని తాజాగా ఎన్నికల సంఘానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 29సీ(3) ప్రకారం, దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు రూ. 20 వేలకు మించిన విరాళాల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి తప్పనిసరిగా తెలియజేయాల్సి ఉంటుంది. గతంలోనూ సుప్రీంకోర్టు రాజకీయ పార్టీల విరాళాలకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది.

