TDP allegations on Jagan| మాజీ సీఎం జగన్(Jagan) కుటుంబంలో ఆస్తుల వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఒకరిపై ఒకరు లేఖాస్త్రాలు సంధించుకుంటూ పొలిటికల్ హిట్ రేపుతున్నారు. అయితే వైఎస్ ఆస్తుల వివాదాన్ని అధికార టీడీపీ(TDP) మాత్రం చక్కగా వినియోగించుకుంటోంది. ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడంలేదు. వరుసగా ట్వీట్స్ చేస్తూ వైసీపీ(YCP)పై విమర్శల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా జగన్ తల్లి విజయమ్మ(YS Vijayamma) అమెరికా పర్యటన నుంచి సంచలన ట్వీట్ చేసింది. ఎన్నికల ముందు విజయమ్మ అమెరికా ఎందుకు వెళ్లారు..? ఎన్నికలు అయిపోగానే హైదరాబాద్ ఎందుకు వచ్చారు..? అనే ప్రశ్నలు లేవనెత్తింది.
“రోడ్డు పక్కన ధీనంగా పడి ఉన్న ఈ ఖరీదైన కారు ఎవరిదో కాదు. వందల మందిని తనకు రక్షణగా పెట్టుకుని తిరిగే లక్షల కోట్ల ఆస్తిపరుడు జగన్ మోహన్ రెడ్డి తల్లి విజయ రాజశేఖర్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం ఇది. సరికొత్త కారు. అత్యాధునిక సెక్యూరిటీ హంగులు ఉన్న కారు. అయినప్పటికీ ఒకేసారి రెండు చక్రాలు ఊడిపోయాయి. ఇంకా నయం ఆమెకు ప్రాణాపాయం తప్పింది. ఇంత హై ఎండ్ కారు, అదీ కొత్త కారుకి ఇలా జరగడం చూసి, ముందు ఆశ్చర్యపోయి, తర్వాత మన సైకో బ్యాక్ గ్రౌండ్ తెలిసి, ఏం జరిగిందో చాలా మంది ఊహించారని టీడీపీ చెప్పుకొచ్చింది. 2024 ఎన్నికల ముందు. 2019 ఎన్నికలకు బాబాయ్ ని లేపేసినట్టే… ఈ ఎన్నికలకు మరో పెద్ద తలకాయను జగన్ టార్గెట్ చేస్తాడేమో అని ఏపీ ప్రజలు అనుకుంటున్న సమయంలో ఇది జరిగింది. తర్వాత ఏడాది పాటు విజయ రాజశేఖర్ రెడ్డి గారు అమెరికాలోనే ఉన్నారు. లోగుట్టు ఆ కుటుంబానికే తెలుసు” అని ట్వీట్ చేసింది.
కాగా ఎన్నికలకు ముందు విజయమ్మ.. హైదరాబాద్ నుంచి కొత్త కారులో కర్నూలులో జరిగిన బంధువుల శుభకార్యానికి వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో ఆమె ప్రయాణిస్తున్న కారు రెండు టైర్లు ఒకేసారి పేలిపోయాయి. దీంతో అత్యంత భద్రత ఉండే సీఎం తల్లి ప్రయాణిస్తున్న కారులో రెండు టైర్లు ఒకేసారి ఎలా పేలతాయనే అనుమానాలు వెల్లువెత్తాయి. అప్పుడు టీడీపీ దీని వెనక ఏదో కుట్ర దాగి ఉందని ఆరోపణలు చేసింది. తాజాగా ఆ ఆరోపణలను మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. మరి టీడీపీ చేస్తున్న ఆరోపణలను వైసీపీ ఎలా తిప్పికొడుతుందో వేచి చూడాలి.