ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. చిలకలూరిపేట వైసీపీ ఇంఛార్జ్, మాజీ మంత్రి విడదల రజినీ(Vidadala Rajini)పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో జిల్లా పాలిటిక్స్ మిర్చి ఘాటును తలపిస్తున్నాయి. తనపై కేసు నమోదుకు నరసరావుపేట టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు(Lavu Krishna Devarayalu) కారణమంటూ రజినీ చేసిన ఆరోపణలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను కాల్ డేటా తీసుకున్నానని ఆరోపణలు చేస్తున్నారు.. మా ఇంట్లోనూ మహిళలు ఉన్నారు.. అలాంటి క్యారెక్టర్ నాది కాదు. 40 ఏళ్లుగా విజ్ఞాన్ విద్యాసంస్థలు నడుపుతున్నాం. ఏపీలో మాకు భూమి కావాలని ప్రభుత్వాన్ని అడగలేదు.. అమరావతిలో కూడా భూమి కోసం దరఖాస్తు చేయలేదు. 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వేలం వేస్తే అధిక ధర చెల్లించి భూమి తీసుకున్నాం. వేలానికి, కేటాయింపుకి మధ్య చాలా తేడా ఉంది.
నీ వేధింపులు ఎదుర్కొన్న స్టోన్ క్రషర్స్ సంస్థ కేసు పెడితే నాపై ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? ఐపీఎస్ అధికారి జాషువా స్టేట్మెంట్, ఇతర అధికారుల స్టేట్మెంట్లు కూడా ఉన్నాయి. నాకు బూతులు చేతకావు.. రజని మాదిరిగా అబద్ధాలు చెప్పలేను. చాలా మంది దగ్గర రజినీ డబ్బులు తీసుకున్నారు. 10 రోజుల క్రితం ఈ కేసును ఆపాలని ఓ వ్యక్తిని నా దగ్గరికి రాయబారానికి పంపిన మాట వాస్తవం కాదా..? స్టోన్ క్రషర్స్ యజమానులకి డబ్బులు తిరిగి చెల్లిస్తానని చెప్పిన మాట నిజం కాదా..? అంటూ శ్రీకృష్ణదేవరాయలు ప్రశ్నించారు.
కాగా అంతకుముందు రజినీ మాట్లాడుతూ.. ‘నాపై కేసు ఎవరు పెట్టించరో.. ఎందుకు పెట్టించారో నాకు అన్నీ తెలుసు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రోద్బలంతోనే ఏసీబీ కేసు పెట్టారు. అసలు ఆయనకు నామీద కోపం ఎందుకు ఉందో కూడా తెలియదు. 2020 వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. సెప్టెంబరు 2వ తేదీన వైఎస్ వర్దంతి రోజు ఇద్దరు పోలీసులకు లంచాలు ఇచ్చి.. నా ఫోన్, నా బంధువుల ఫోన్ నెంబర్లు కనుక్కొని కాల్ డేటా తీశారు. అసలు ఒక ఎంపీగా ఉన్న వ్యక్తి.. ఎమ్మెల్యే కాల్ డేటా తీస్తారా?. అంటూ ఆరోపణలు చేశారు.