Thursday, March 12, 2026
Homeఆంధ్రప్రదేశ్Venkaiah Naidu: రాజకీయాల్లో 'బూతుల' ఫ్యాషన్: పోలింగ్ బూత్‌లోనే బుద్ధి చెప్పండి! - వెంకయ్య నాయుడు

Venkaiah Naidu: రాజకీయాల్లో ‘బూతుల’ ఫ్యాషన్: పోలింగ్ బూత్‌లోనే బుద్ధి చెప్పండి! – వెంకయ్య నాయుడు

Vizag: రాజకీయాల్లో హుందాతనం మృగ్యమవుతున్న వేళ, భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు తనదైన శైలిలో రాజకీయ నాయకుల తీరుపై విరుచుకుపడ్డారు. శనివారం విశాఖ జిల్లా పెందుర్తిలో జరిగిన ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ప్రస్తుత రాజకీయ ముఖచిత్రంపై ఆవేదన వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

నోరు తెరిస్తే బూతులు.. ఇదేం ఫ్యాషన్?
“కొందరు నాయకులకు బూతులు మాట్లాడటం ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది” అంటూ వెంకయ్య నాయుడు మండిపడ్డారు. నోరు పారేసుకుంటేనే మీడియాలో హైలైట్ అవుతామని, పేపర్లలో వస్తామని భావించడం దౌర్భాగ్యమని ఆయన విమర్శించారు. ఎదుటివారిపై విమర్శలు చేసే సత్తా లేక, ఏమాత్రం సంబంధం లేని వారి తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను వివాదాల్లోకి లాగడం రాజకీయ పతనానికి నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: Kakani – నెల్లూరు ఇరిగేషన్ దోపిడీ .. సోమిరెడ్డే ఆ ‘కింగ్’..

ప్రజల చేతిలోనే బ్రహ్మాస్త్రం
అసెంబ్లీలు, పార్లమెంటులు భవిష్యత్తు తరాలకు పాఠశాలలు కావాలని, కానీ అక్కడ సాగుతున్న భాష చూసి యువత ఏం నేర్చుకుంటుందని ఆయన ప్రశ్నించారు. ఈ పరిస్థితి మారాలంటే ప్రజల దగ్గర ఒకే ఒక మార్గం ఉందని ఆయన సూచించారు. “బూతులు మాట్లాడే నాయకులకు ప్రజలు పోలింగ్ బూత్‌లలోనే సమాధానం చెప్పాలి. అసందర్భ ప్రేలాపనలు చేసే వారికి ఎన్నికల్లో నిశ్శబ్దంగా గుణపాఠం చెప్పినప్పుడే వ్యవస్థలో మార్పు వస్తుంది.”

పార్టీలకు అతీతంగా.. ఆత్మపరిశీలన
ఈ ధోరణి కేవలం ఒక పార్టీకే పరిమితం కాలేదని, అన్ని పార్టీల్లోనూ ఇలాంటి వారు ఉన్నారని ఆయన కుండబద్దలు కొట్టారు. ఇప్పటికైనా రాజకీయ నాయకులు తమ ప్రసంగాల్లో సంయమనం పాటించాలని, హుందాతనాన్ని కాపాడుకోవాలని హితవు పలికారు. వెంకయ్య నాయుడు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమే కానీ, అవి వ్యక్తిగత దూషణల స్థాయికి పడిపోకూడదన్న ఆయన మాటలు ఆలోచింపజేస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News