Kondapalli Municipal Election: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని అన్ని మున్సిపాలీటీల్లో టీడీపీ జెండా ఎగురుతుంది. ఇప్పటికే అనేక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కైవసం చేసుకుంది. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి మున్సిపాలిటీని తన ఖాతాలో వేసుకుంది. దీంతో టీడీపీ అభ్యర్థి చెన్నుబోయిన చిట్టిబాబు చైర్మెన్‌గా.. వైస్ చైర్మెన్‌గా టీడీపీకి మద్దతు ఇచ్చిన స్వతంత్ర అభ్యర్ధి.. శ్రీదేవి ఎన్నికయ్యారు. చైర్మన్ పీఠం దక్కడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు.
కొండపల్లి మున్సిపాలిటీలో మొత్తం 29 వార్డులు ఉన్నాయి. 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ చెరో 14 స్థానాల్లో గెలుపొందాయి. ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. అయితే స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన శ్రీదేవి తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపారు. దీంతో ఆ పార్టీ బలం 15కు చేరింది. అయితే అప్పటి వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తన ఎక్స్ అఫిషియో ఓటును వినియోగించుకోవడంతో ఆ పార్టీ బలం కూడా 15కు చేఱుకుంది
దీంతో అప్పటి విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని తన ఎక్స్ అఫిషియో ఓటును వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ బలం 16కు చేరింది. కానీ కేశినేని నాని ఓటు చెల్లుబాటుపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. కేశినేని నాని వేసిన ఎక్స్ అఫిషియో ఓటు చెల్లుతుందని సీల్డ్ కవర్‌లో ఆదేశాలు జారీ చేసింది. తాజాగా కోర్టు సీల్డ్ కవర్ ఆదేశాలను తెరిచి అధికారులు.. చెన్నుబోయిన చిట్టిబాబు చైర్మన్‌గా, శ్రీదేవి వైస్ చైర్మన్‌గా ఎన్నికైనట్లు ప్రకటించారు.
ఇదిలా ఉంటే 2024 ఎన్నికలకు ముందు కేశినేని నాని టీడీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనంతరం వైసీపీలో చేరి ఆ పార్టీ నుంచి విజయవాడ ఎంపీగా సొంత తమ్ముడు కేశినేని చిన్ని మీద పోటీ చేశారు. అయితే ఎన్నికల్లో ఆయన తమ్ముడు చేతిలో ఓడిపోయారు. దీంతో రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. అలాంటిది టీడీపీకి రాజీనామా చేసినా గతంలో తాను వేసి ఓటుతో ఇప్పుడు కొండపల్లి మున్సిపాలిటీ పీఠం టీడీపీ కైవసం చేసుకోవడం విశేషం.
TDP: కేశినేని నాని ఓటుతో కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ కైవసం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES


