ఆలూరు నియోజకవర్గ పరిధిలో హొళగుంద మండలం మార్లమడికి సచివాలయ పరిధిలోని ముద్దటమాగి గ్రామంలో పనిచే స్తున్న వాలంటీరు తలారి లక్ష్మన్న ఎన్నికల ప్రవర్తన నియమావళిని అతిక్రమించడంతో విధుల్లో నుంచి తొలగిస్తున్నట్లు ఎంపీడీవో ఆజాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. ముద్దటమాగి గ్రామంలో వైయస్సార్సీపి పార్టీ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో శనివారం తలారి లక్ష్మన్న పాల్గొన్నట్లు ఫిర్యాదు రావడంతో అధికారులు విచారణ జరిపారు. ఆరోపణలు రుజువవడంతో అతడిని విధుల్లో నుంచి తొలగించి జిల్లా కలెక్టర్ కు నివేదిక పంపినట్లు తెలిపారు.
కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు
ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వాలంటీర్లను తొలగించడమే కాక వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినా అధికారులు మాత్రం ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్లపై ఉదాసీనత ప్రదర్శిస్తున్నారు. కేవలం తొలగింపు ఆదేశాలు జారీచేసి చేతులు దులుపుకుంటున్నారు. ఈ విషయంపై ఎంపిడిఓ ఆజాద్ ను వివరణ కోరగా వాలంటీర్లు ఒక్కరే వెళ్లి ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికార పార్టీ నాయకులతో పాటు ప్రచారంలో పాల్గొంటే విధుల నుండి తొలగిస్తామని తెలిపారు.