Saturday, February 14, 2026
Homeఆంధ్రప్రదేశ్Ambati : నిప్పు రాజేసిన నిరసన: అంబటి ఇంటిపై రాళ్ల వర్షం.. కోడిగుడ్లతో మహిళల...

Ambati : నిప్పు రాజేసిన నిరసన: అంబటి ఇంటిపై రాళ్ల వర్షం.. కోడిగుడ్లతో మహిళల ఆగ్రహం!

Ambati Rambabu house attack Guntur : రాజకీయాల్లో విమర్శలు సహజం.. కానీ అవి హుందాతనాన్ని దాటి, వ్యక్తిగత దూషణలకు దిగితే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో గుంటూరు నవభారత నగర్ సాక్షిగా శనివారం స్పష్టమైంది. “ముందు నుయ్యి వెనుక గొయ్యి” అన్న చందంగా మారిన మాజీ మంత్రి అంబటి రాంబాబు పరిస్థితి ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన తండ్రిని ఉద్దేశించి అంబటి చేసిన అసభ్యకర వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా నిప్పు రాజేశాయి. కోపోద్రిక్తులైన తెలుగు తమ్ముళ్లు, మహిళా నేతలు అంబటి ఇంటిని ముట్టడించడంతో అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. 

- Advertisement -

ముట్టడి.. ధ్వంసం.. రణరంగమైన నవభారత నగర్ : ముఖ్యమంత్రిపై అంబటి చేసిన ‘మురికి’ వ్యాఖ్యలు వినగానే టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చాయి. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి నేతృత్వంలో వందలాది మంది కార్యకర్తలు అంబటి నివాసాన్ని చుట్టుముట్టారు. “నోటి దురదకు తగిన శాస్తి జరగాల్సిందే” అంటూ నినాదాలతో హోరెత్తించారు.

రాళ్ల వర్షం – ఆస్తుల ధ్వంసం: ఉద్రిక్తత పరాకాష్టకు చేరడంతో ఆందోళనకారులు అంబటి ఇంటిపై రాళ్లు రువ్వారు. ఈ క్రమంలో ఇంటి కిటికీ అద్దాలు, పూలకుండీలు చిన్నాభిన్నమయ్యాయి. బయట నిలిపి ఉంచిన అంబటి వాహనం అద్దాలను సైతం కార్యకర్తలు ధ్వంసం చేశారు. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు ప్రయత్నించినప్పటికీ, జనం తాకిడికి బారికేడ్లు సైతం చెల్లాచెదురయ్యాయి.

నిరసనలో తెలుగు మహిళలు అగ్రభాగన నిలిచారు. చేతుల్లో చీపుర్లు పట్టుకుని, అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా నినదించారు. అంబటి ఇంటిపై కోడిగుడ్లు విసిరి తమ నిరసనను వ్యక్తం చేశారు. “ముఖ్యమంత్రి తల్లిదండ్రులను లాగడం సంస్కారమా? బేషరతుగా క్షమాపణ చెప్పే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదు” అంటూ భీష్మించుక కూర్చున్నారు.

అంబటి రాంబాబుపై కేవలం ప్రజల ఆగ్రహమే కాదు, చట్టపరమైన ఉచ్చు కూడా బిగుస్తోంది.
కేసుల నమోదు: సీఎంపై అసభ్య వ్యాఖ్యలు చేసినందుకు గాను నల్లపాడు పోలీసులు అంబటిపై కేసు నమోదు చేశారు. అలాగే పల్నాడు జిల్లా నకరికల్లు పీఎస్‌లోనూ మరో కేసు నమోదైంది.
నేతల విమర్శలు: “వైఎస్సార్సీపీ అంటే రాజకీయ పార్టీనా లేక రౌడీల అడ్డానా?” అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య నిలదీశారు. అంబటి వాడిన భాషను ఆయన భార్యాబిడ్డలే ఛీకొడతారని మంత్రి పార్థసారథి ఎద్దేవా చేశారు.

అరెస్టుకు సన్నాహాలు:  పరిస్థితి విషమించడంతో అంబటి రాంబాబును అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఆయనను సురక్షితంగా స్టేషన్‌కు తరలించేందుకు, ఆందోళనకారుల నుంచి రక్షణ కల్పించేందుకు ప్రత్యేకంగా ‘వజ్ర’ వాహనాన్ని రప్పించారు. అంబటిని ఎప్పుడు అరెస్టు చేస్తారనే ఉత్కంఠ ప్రస్తుతం గుంటూరులో నెలకొంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News