Homeఆంధ్రప్రదేశ్TG Bharat : కర్నూలు ప్రగతికి 'భరత్' భరోసా.. ఘనంగా జన్మదిన వేడుకలు!

TG Bharat : కర్నూలు ప్రగతికి ‘భరత్’ భరోసా.. ఘనంగా జన్మదిన వేడుకలు!

కర్నూలు (తెలుగు ప్రభ) :  మంత్రి టీజీ భరత్ జన్మదిన వేడుకలు బుధవారం కర్నూలు నగరంలో పండగ వాతావరణంలో ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా మంత్రి ముందుగా దేవాదాయ శాఖ గోశాలలో తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బుధవారపేటలో స్థానిక నాయకుడు అబ్బాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. సమాజంలో మహిళల పాత్రను కొనియాడుతూ, పలువురు పేద మహిళలకు స్వయంగా చీరలను పంపిణీ చేశారు.

- Advertisement -

రవాణా కష్టాలకు చెక్.. నూతన లింక్ రోడ్డు ప్రారంభం : నగరంలో ఏళ్ల తరబడి పట్టిపీడిస్తున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి మంత్రి టీజీ భరత్ కీలక అడుగు వేశారు. బళ్ళారి చౌరస్తా వద్ద నిత్యం ఎదురవుతున్న వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని, హైదరాబాద్ మార్గం నుండి వచ్చే వాహనాలను ఎస్.ఏ.పి (SAP) క్యాంప్ మీదుగా కొత్త బస్టాండ్ వైపు మళ్లించేందుకు నూతనంగా నిర్మించిన రహదారిని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ— “ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కర్నూలు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి, ప్రతిష్టాత్మక ‘స్మార్ట్ సిటీ’గా తీర్చిదిద్దడమే మన ప్రధాన లక్ష్యం. మౌలిక వసతుల కల్పనలో రాజీ పడేదే లేదు” అని స్పష్టం చేశారు.

వెల్లువెత్తిన నేతల శుభాకాంక్షలు.. సంక్షేమ కార్యక్రమాలు : మంత్రి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పుట్టినరోజు వేడుకలకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపారు. పాణ్యం శాసనసభ్యురాలు గౌరు చరితా రెడ్డి మంత్రి టీజీ భరత్‌ను నేరుగా కలసి మర్యాదపూర్వకంగా పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం నగరవ్యాప్తంగా పలు సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి. ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ‘షేర్ షా సూరి చారిటబుల్ ట్రస్ట్’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో గత 2 ఏళ్ల కాలంలో సాధించిన అభివృద్ధిని గుర్తుచేసుకుంటూ జ్ఞాపకంగా మొక్కలు నాటారు. ప్రభుత్వ కంటి ఆసుపత్రిని సందర్శించి అక్కడ చికిత్స పొందుతున్న రోగులకు పండ్లను పంపిణీ చేశారు. సిటీ స్క్వేర్ మాల్‌లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని, అలాగే చల్లా కంపౌండ్‌లో ప్రజల సౌకర్యార్థం నూతనంగా ఏర్పాటు చేసిన ‘ఆధార్ సేవా కేంద్రాన్ని’ మంత్రి ప్రారంభించారు.

స్ఫూర్తినింపిన అభిమానం: గోశాలకు భారీ విరాళం : మంత్రి టీజీ భరత్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన అభిమాని, తెలుగుయువత రాష్ట్ర అధికార ప్రతినిధి జూటూరు రవి దాతృత్వాన్ని చాటుకున్నారు. గాయత్రీ గోసేవ సమితి ఆధ్వర్యంలో నడుస్తున్న గాయత్రీ గోశాలకు రూ. 55,555 ల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. మంత్రి టీజీ భరత్ చేతుల మీదుగా ఈ చెక్కును గోశాల అధ్యక్షుడు జగదీష్ గుప్తాకు అందజేశారు. మంత్రి టీజీ భరత్ నిరంతరం చేస్తున్న ప్రజాసేవయే తమకు స్ఫూర్తి అని, అందుకే తమ వంతుగా సామాజిక బాధ్యతతో ఈ విరాళం అందించామని జూటూరు రవి పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News