Thief returns stolen temple donation box : “అమ్మా! తప్పయిపోయింది… క్షమించు తల్లీ!” అంటూ ఓ దొంగ పశ్చాత్తాపంతో రాసిన లేఖ ఇప్పుడు అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది. చేసిన పాపానికి దైవమే శిక్ష విధించిందని భయపడ్డాడో ఏమో, కాజేసిన హుండీని నెల రోజుల తర్వాత తిరిగి ఆలయం వద్దే వదిలేసి వెళ్ళాడు. ఈ వింత ఘటన వెనుక ఉన్న అసలు కథేంటి…? ఆ దొంగ మనసు మార్చుకోవడానికి కారణం ఏమిటి.?
అపహరణ నుంచి పశ్చాత్తాపం వరకు… అసలేం జరిగింది : అనంతపురం జిల్లా, బుక్కరాయసముద్రం చెరువు కట్ట సమీపంలోని ప్రసిద్ధ ముసలమ్మ ఆలయంలో నెల రోజుల క్రితం దొంగలు పడి హుండీని అపహరించుకుపోయారు. ఉదయాన్నే గుడికి వచ్చిన నిర్వాహకులు హుండీ మాయమవ్వడం గమనించి లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినా దొంగల జాడ మాత్రం దొరకలేదు. కాలం గడుస్తున్న కొద్దీ హుండీ సంగతి అందరూ మర్చిపోతున్న తరుణంలో, కథ అనుకోని మలుపు తిరిగింది.
గురువారం రాత్రి, దొంగిలించబడిన హుండీ మళ్లీ ఆలయం వద్ద ప్రత్యక్షమైంది. శుక్రవారం ఉదయం హుండీని చూసిన నిర్వాహకుల ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది. హుండీ పక్కనే ఉన్న ఓ లేఖ వారిలో మరింత ఉత్కంఠను రేపింది. ఆ లేఖలో దొంగ తన తప్పును ఒప్పుకుంటూ రాసిన వాక్యాలు అందరినీ ఆలోచింపజేశాయి.
“కొడుకును కాపాడు తల్లీ : “అమ్మా ముసలమ్మా! నీ సొమ్ము దొంగిలించిన పాపానికి నా కొడుకు అనారోగ్యం పాలయ్యాడు. వాడి ఆసుపత్రి ఖర్చుల కోసం హుండీలోని కొంత డబ్బు వాడుకున్నాను. నన్ను క్షమించు తల్లీ, నా బిడ్డను కాపాడు” అంటూ ఆ దొంగ తన ఆవేదనను అక్షర రూపంలో పెట్టాడు. ఈ లేఖను చదివిన ఆలయ నిర్వాహకులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
హుండీని స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులోని నగదును లెక్కించగా, సుమారు రూ. 1,86,000 ఉన్నట్లు తేలింది. దొంగ తన కొడుకు వైద్య ఖర్చుల కోసం కొంత మొత్తాన్ని వాడుకున్నట్లు చెప్పినప్పటికీ, హుండీలో ఇంకా భారీ మొత్తంలోనే డబ్బు ఉండటం గమనార్హం. అమ్మవారి మహత్యం వల్లే దొంగకు జ్ఞానోదయం కలిగిందని, అందుకే పశ్చాత్తాపంతో హుండీని తిరిగి తెచ్చిచ్చాడని భక్తులు, ఆలయ నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా ఆ దొంగ ఎవరనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.
గతంలోనూ ఇలాంటి ఘటనలు : ఇటీవల కాలంలో ఇలాంటి వింత దొంగతనాలు తరచూ వెలుగుచూస్తున్నాయి. తెలంగాణలో ఓ దొంగ హోటల్‌లో ఏమీ దొరక్కపోవడంతో, ఫ్రిజ్‌లోని కూల్ డ్రింక్ తాగి, దానికి డబ్బులిచ్చి వెళ్లిన ఘటన మరువక ముందే, అన్నమయ్య జిల్లా రాజంపేటలోని ఆంజనేయ స్వామి ఆలయ హుండీలో ఓ భక్తుడు రూ. 1.39 కోట్ల విలువైన వజ్రాన్ని వేయడం తెలిసిందే. దేవుడి సొమ్ము పాపమని భావించాడో, లేక దైవభక్తితో చేశాడో తెలియదు కానీ, ఈ ఘటనలు మాత్రం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి.


