World Telugu Conference: తెలుగు భాషను విశ్వవ్యాప్తం చేసే లక్ష్యంతో నిర్వహిస్తున్న మూడో ప్రపంచ తెలుగు మహాసభలకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం వేదికైంది. స్థానిక కిమ్స్ వైద్య కళాశాల ప్రాంగణంలో శనివారం (ఫిబ్రవరి 28), ఆదివారం (మార్చి 1) రెండు రోజుల పాటు ఈ అక్షర ఉత్సవం వైభవంగా జరగనుంది.
ఎన్టీఆర్ వేదికపై తెలుగు వెలుగులు: కిమ్స్ చైర్మన్ కేవీవీ సత్యనారాయణరాజు నేతృత్వంలో ఈ సభల కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. మహాసభల కోసం కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ వేదికకు తెలుగువారి ఆరాధ్యదైవం నందమూరి తారక రామారావు పేరు పెట్టారు. తొలిరోజు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, భూపతిరాజు శ్రీనివాసవర్మ హాజరుకానున్నారు. గౌరవ అతిథులుగా రాష్ట్ర శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఉపసభాపతి రఘురామకృష్ణరాజు హాజరుకానున్నారు. ఆధ్యాత్మిక ప్రవచనకర్తలు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహారావు తమ ప్రసంగాలతో అలరించనున్నారు.
Also read-Guntur: సామాన్యురాలిలా కలెక్టర్ తనిఖీ.. సిబ్బంది నిర్వాకం చూసి షాక్!
కోనసీమలో పండగ వాతావరణం: మహాసభల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా జిల్లా కలెక్టర్ ఆర్. మహేశ్ కుమార్ శుక్రవారం ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. పార్కింగ్, భద్రత, అతిథుల వసతి విషయాల్లో అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు భాషాభిమానులు, సాహితీవేత్తలు ఈ సభలకు తరలివస్తుండటంతో కోనసీమలో పండగ వాతావరణం నెలకొంది.

