ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఎండలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. మరోవైపు వడగాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయితే రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారుతాయని వాతావరణశాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉండగా, మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా, పిడుగుల ప్రమాదం కూడా పొంచి ఉందని వాతావరణ శాఖ సూచించింది.
రాబోయే మూడు రోజుల్లో ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పిడుగుల వర్షం కురిసే అవకాశముందని వెల్లడించారు. బుధవారం (02-04-25) శ్రీసత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. గురువారం రాయలసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. శుక్రవారం ఉత్తరాంధ్రలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
అకాల వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున, పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు, విద్యుత్ స్థంభాలు, టవర్ల కింద నిలవరాదని హెచ్చరించారు. మరోవైపు, కొన్ని జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండనుంది. బుధవారం (02-04-25) శ్రీకాకుళం (6 మండలాలు), విజయనగరం (5), పార్వతీపురం మన్యం (11), అల్లూరి సీతారామరాజు (5), కాకినాడ (1), తూర్పుగోదావరి (2) జిల్లాల్లో వడగాలుల ప్రభావం చూపే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గురువారం 47 మండలాల్లో వడగాలుల ప్రభావం కనిపించనుందని అంచనా వేస్తున్నారు.