LPG Ships to Visakha Port: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హామీ ఇచ్చినట్టే భారత్‌కు ప్రస్తుతానికి ఇంధన, గ్యాస్ కొరత లేదని అధికారులు సైతం చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే విశాఖ పోర్టుకు క్రూడ్, గ్యాస్ ఎల్పీజీ సరకుతో కూడిన నౌకలు క్యూ కట్టనున్నాయి. మూడు ఎల్పీజీ నౌకలు ఒకేసారి రానుండటం ఒకింత సంతృప్తికర సమాచారమేనని వినియోగదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ రోజు ఒకటి, 30వ తేదీన మరో 2 నౌకలు విశాఖ పోర్టుకు రానున్నాయని అధికారులు తెలియజేశారు. పోర్టు నుంచి క్రూడ్, ఎల్పీజీ నౌకల రాకపోకల పూర్తి వివరాల్ని ఒక ప్రకటనలో వివరించారు.
గత ఫిబ్రవరి 2న 22 టీఎంటీల సామర్థ్యమున్న ఎల్పీజీ/లుపినస్ అనే నౌక ఖతార్‌లో లోడింగ్ పూర్తి చేసుకుని ఈ నెల 3న విశాఖ వైపు బయల్దేరింది. అదే విధంగా ఈ నెల 1న ఎంటీ స్వర్ణ బ్రహ్మపుత్ర అనే నౌక (68టీఎంటీల సామర్థ్యం) కాకినాడ పోర్టు(భారత్)లో లోడింగ్ అనంతరం 64 టీఎంటీ క్రూడ్‌తో ముంబయికి ఈ నెల 8న బయల్దేరింది. అంతేకాకుండా ఎంటీ స్వర్ణ సింధు అనే 49 టీఎంటీ సామర్థ్యమున్న నౌక ముంబయి పోర్టులో లోడింగ్ అనంతరం ఈ నెల 8న బయల్దేరింది.
26 టీఎంటీ సామర్థ్యమున్న ఎల్పీజీ/సీఏ`1 డబ్ల్యూయూకేఐఆర్ అనే నౌక యూఏఈలో లోడింగ్ పూర్తి చేసుకుని ఈ నెల 12న బయల్దేరింది. ఎంటీ తేశ్ విహాల్ అనే 204 టీఎంటీ సామర్థ్యమున్న నౌక బస్రా(ఇరాక్)లోని లోడింగ్ పూర్తి చేసుకుని ఈ నెల 10న బయల్దేరింది. ఎంటీ దేశ్ విశాల్ అనే 112 టీఎంటీ సామర్థ్యమున్న నౌక బస్రాలోని లోడింగ్ పూర్తి చేసుకుని ఈ నెల 14న బయల్దేరింది. ఎంటీ వెలోరా అనే 140 టీఎంటీ కెపాసిటీ ఉన్న నౌక రష్యాలోని నోవోరోసిస్క్‌లో ఈ నెల 13న లోడింగ్ పూర్తి చేసుకుని ఈ నెల 15న బయల్దేరిందని అధికారులు తెలిపారు.
గాబోస్ నుంచీ మరో నౌక
ఎంటీ డెల్టా కనారిస్ అనే 102 టీఎంటీ సామర్థ్యమున్న మరో నౌక గాబోస్‌లోని జెంటిల్ పోర్టులో ఈ నెల 17న లోడింగ్ పూర్తి చేసుకుని 18న బయల్దేరిందని అధికారులు తెలిపారు. ఎంటీ స్వర్ణ గంగ అనే 79 టీఎంటీల కెపాసిటీ ఉన్న నౌక భారత్‌లోని ముంద్రా తీరంలో ఈ నెల 20న లోడింగ్ పూర్తి చేసుకుని 22న బయల్దేరింది. అదే విధంగా ఎంటీ స్వర్ణ గోదావరి అనే నౌక 67 టీఎంటీల కెపాసిటీతో కాకినాడ తీరంలో ఈ నెల 20న లోడింగ్ పూర్తి చేసుకుని 22న బయల్దేరి ఇప్పటికే వచ్చేసినట్టు అధికారులు తెలిపారు. ఎంటీ స్వర్ణ సింధు అనే 82 టీఎంటీల సామర్థ్యమున్న నౌక కాకినాడలో ఈ నెల 22న లోడింగ్ పూర్తి చేసుకుని 24న ఆంకరేజ్‌కు మార్చబడిందని, ఆ నౌక కూడా ఇప్పటికే సరకుతో చేరుకుందని అధికారులు తెలిపారు. ఎంటీ సెంచూరియన్ అనే 100 టీఎంటీల నౌక రష్యాలోని ఆర్‌యూ యూఎల్‌యూ పోర్టులో ఈ నెల 25న లోడింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం డిశ్చార్జి కొనసాగుతోందని పోర్టు అధికారులు తెలియజేశారు.
అదే విధంగా ఎంటీ జంబో అనే 16,728 టీఎంటీ కెపాసిటీ ఉన్న రష్యాకు చెందిన పెద్ద నౌక నావ్‌షిప్ అనే ఏజెంట్ ఆధ్వర్యంలో ఎల్పీజీ/సీ బీడబ్ల్యూ బిర్చ్ సరకుతో 24టీఎంటీ సామర్థ్యమున్న మరో నౌకతో కలిసి భారత్‌లో ట్రాన్స్‌షిప్‌మెంట్ ద్వారా రానుందని అధికారులు అంచనా వేశారు. ఈ నౌక శుక్రవారానికి విశాఖ పోర్టుకు చేరనుందంటున్నారు. అదే విధంగా ఎల్పీజీ/క్రూడ్ హెల్లాస్ గ్లాడియేటర్ అనే మరో 24 టీఎంటీల కెపాసిటీ ఉన్న నౌక ఇప్పటికే నెదర్లాండ్స్‌లోని లోడింగ్ పూర్తి చేసుకుని, జ్యూపిటర్ అనే మరో 24 టీఎంటీల కెపాసిటీ (యూఎస్‌కు చెందిన) నౌకతో కలిసి ఈ నెల 30వ తేదీ నాటికి రానున్నాయి.
అంతేకాకుండా వచ్చే నెలలో రానున్న నౌకల వివరాల్నీ అధికారులు తెలియజేశారు. ఎంటీ ఫౌండేయ అనే 96,542 మెట్రిక్ టన్నుల కెపాసిటీ ఉన్న రష్యాకు చెందిన ఈ నౌక నావ్‌షిప్ అనే ఏజెంట్ ద్వారా త్వరలోనే రానుంది. అంతేకాకుండా ఎండీ దేష్ గౌరవ్ అనే 99,899 మెట్రిక్ టన్నుల కెపాసిటీ ఉన్న బ్లెండెడ్ క్రూడాయిల్ నౌక ముంద్రా తీరంలో లోడింగ్ పూర్తి చేసుకుంది. ఏవీబీజీపీఆర్ అనే ఏజెంట్ ద్వారా వస్తున్న ఈ నౌక అతి త్వరలో విశాఖ వస్తుందని అధికారులు అంచనా వేశారు.

