Homeఆంధ్రప్రదేశ్Yeleswaram forest: ఏలేశ్వరం అడవుల్లో పెద్దపులి సంచారం.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష

Yeleswaram forest: ఏలేశ్వరం అడవుల్లో పెద్దపులి సంచారం.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష

* పరిసర 5 గ్రామాల్లో హై అలర్ట్

- Advertisement -

శంఖవరం, సెప్టెంబర్ 10 (తెలుగుప్రభ): కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం రేంజ్ పరిధిలో పెద్దపులి సంచారంతో అటవీశాఖ అప్రమత్తమైంది. అటవీశాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం ఏలేశ్వరం సెక్షన్ అటవీశాఖ పరిధిలోని పెద్దిపాలెం బీట్ ఉలిగోగుల రిజర్వ్ ఫారెస్ట్ కంపార్టుమెంట్ నెం. 574 లో గురువారం ఉదయం సుమారు 5:30 గంటలకు రేడియో కాలర్ ద్వారా పెద్దపులి కదలికలను గుర్తించారు. వెంటనే అటవీశాఖ అధికారులు అప్రమత్త మయ్యారు. జిల్లా అటవీశాఖ అధికారి ఎన్.రామచంద్ర రావుకు విషయాన్ని వివరించారు. ఆయన ఆదేశాల మేరకు ఏలేశ్వరం అటవీశాఖ విస్తరణ అధికారి శ్రీనివాసరావు, ఏలేశ్వరం అటవీశాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ జాన్సన్, మిగతా అటవీశాఖ సిబ్బంది బృందం పులి సంచరిస్తున్న ప్రాంతాల పరిశీలనకు బయలుదేరి వెళ్ళారు. పులిని సురక్షితంగా స్పందించేందుకు హనుమాన్ రెస్క్యూ బృందాలను రంగంలోకి దిగాయి. పులి సంచారం వల్ల ప్రజల సంరక్షణార్ధం ముందస్తు జాగ్రత్త చర్యగా దారపల్లి, బురదకోట, మిర్తివాడ, బవురువాక, తాడువాయి గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. అత్యంత జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ ఎవరూ అడవిలోకి వెళ్లరాదని హెచ్చరించారు.‌ అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుంచి బయటకు వెళ్లవద్దు, ఒంటరిగా సంచరించవద్దు. దారపల్లి వాటర్ ఫాల్స్ కు పర్యాటకులు వెళ్లరాదు. ఇక్కడికి పర్యటనలు తాత్కాలికంగా పూర్తిగా నిషేధం. ప్రజలు భయాందోళనకు గురి కాకుండా అటవీశాఖ జారీ చేసిన సూచనలు తప్పనిసరిగా పాటించాలని ప్రకటించారు. పులి సంచారం గురించి ఎటువంటి సమాచారం, ఆనవాళ్లు లేదా కదలికలు కనిపించినా ప్రజలు స్వయంగా దాని దగ్గరకు వెళ్లకుండా వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలి. పులిని వెంబడించడం, గుంపులుగా చేరి చూడడం, ఫోటోలు, వీడియోల కోసం దగ్గరకు వెళ్లడం వంటి చర్యలకు పాల్పడరాదు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అటవీ శాఖ అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు ఎటువంటి భయాందోళనలకు గురికాకుండా, అటవీ శాఖ అధికారులు జారీ చేసే సూచనలు, ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని కాకినాడ జిల్లా అటవీ శాఖాధికారి ఎన్.రామచంద్రరావు ప్రకటించారు.‌ ఏలేశ్వరం ప్రాంతానికి సమీపంలోని ప్రత్తిపాడు మండలం బవురువాక, తాడువాయి, శంఖవరం మండలం శృంగధార, గౌరంపేట, గ్రామాల ప్రజలకు ముందస్తు జాగ్రత్త హెచ్చరికలను జారీ చేసామని శంఖవరం మండలం అటవీశాఖ అధికారి గంటిమళ్ళ నాగేశ్వరరావు “తెలుగుప్రభ”కు గురువారం సాయంత్రం 3.33 గంటలకు చరవాణి ద్వారా తెలిపారు.

*పులి సంచారంపై ఉప ముఖ్యమంత్రి సమీక్ష..*

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధారపల్లి సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో పులి సంచరిస్తున్న నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అధికారుల నుంచి వివరాలు తెలుసు కున్నారు. పులి కదలికలు, ప్రస్తుత పరిస్థితి, అటవీ శాఖ చేపడుతున్న చర్యలు, అటవీ సరిహద్దు గ్రామాల భద్రతకు తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలపై అధికారులను వివరాలు అడిగి తెలుసు కున్నారు. పులి కదలికలపై అటవీశాఖ, రాపిడ్ రెస్పాన్స్ బృందాలను సిద్ధంగా ఉంచాలి. ‘హనుమాన్’ బృందాలు నిరంతర నిఘా కొనసాగించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పులి జనావాస ప్రాంతాల్లోకి ప్రవేశించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన అన్ని చర్యలను సమన్వయంతో చేపట్టాలని సూచించారు. అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు, స్థానిక రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూనే, పులికి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పులి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు అటవీ, పోలీస్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పని చేయాలని, ఈ శాఖలు సమన్వయంతో నిరంతర నిఘా ఉంచాలని పవన్ కళ్యాణ్ సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించేలా రాపిడ్ రెస్పాన్స్ బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అవసరాన్ని బట్టి తక్షణ నిర్ణయాలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News