ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేక సీఎం చంద్రబాబు తిరుపతి లడ్డూతో పక్కదోవ పట్టించే రాజకీయాలను (డైవర్షన్ పాలిటిక్స్ )చేస్తున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీవ్రంగా ధ్వజమెత్తారు. తాడేపల్లిలో నిర్వహించిన ప్రెస్మీట్ లో చంద్రబాబు 100 రోజుల పాలనను ఆయన దుయ్యబట్టారు. హామీలు అమలు చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారు. ఎన్నికల సమయంలో అమలు కానీ హామీలను అవలీలగా చేస్తామని కాకమ్మ కబుర్లు చెప్పారు. అధికారంలోకి వచ్చిన తరువాత హామీల గురించి అడిగితే ఆ ఊసే ఎత్తడం లేదు. చంద్రబాబు వంద రోజుల పాలనలో సూపర్ సిక్స్ లేదు.. సెవెనూ లేదూ. ఆయన పాలనలో వ్యవస్థలన్నీ తిరోగమనంలో ఉన్నాయి… అని పేర్కొన్నారు. తిరుమలలో నెయ్యి కల్తీ అంటూ డైవెర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. రాజకీయాల కోసం దేవుడ్ని కూడా వాడుకునే వ్యక్తి చంద్రబాబు. నెయ్యి కి బదులు జంతువుల కొవ్వుతో లడ్డూ తయారు చేశారని మాటలు సీఎంగా ఉన్న వ్యక్తి మాట్లాడడం కరెక్టేనా? కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీయడం సబబేనా? తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు అల్లుకున్న కట్టుకథలు ఇవి అంటూ జగన్ మండిపడ్డారు.
ప్రతి 6 నెలలకు ఓసారి నెయ్యి సరఫరా కోసం టెండర్లు పిలుస్తారు. నెయ్యి నాణ్యత నిర్ధారణ పరీక్షను ఎవరూ మార్చలేదు దశాబ్దాలుగా జరుగుతున్న పద్ధతుల్లోనే తిరుమలలో లడ్డూ తయారీ జరుగుతోంది… అని మాజీ సీఎం జగన్ వివరించారు. చంద్రబాబుది 100 రోజుల పాలన కాదు.. 100 రోజుల మోసం . 100 రోజుల్లో సూపర్ సిక్స్ లేదు.. సూపర్ సెవెనూ లేదు . సూపర్ సిక్స్ అంటూ ప్రజల జీవితాలతో ఆటలాడారు .
ఇప్పటివరకు విద్యాదీవెన, వసతి దీవెన ఇవ్వలేదు. స్కూళ్లన్నీ పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. గోరు ముద్ద గాలికెగిరిపోయింది. ఆరోగ్య శ్రీ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. 108, 104 ఉద్యోగులకు ఇప్పటివరకూ జీతాలు ఇవ్వలేని పరిస్థితి దాపురించిందని చంద్రబాబుపై జగన్ నిప్పులు చెరిగారు.