Tirumala Laddu Ghee Adulteration Report Controversy : కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం. ఆ ప్రసాద పవిత్రతను దెబ్బతీసేలా జరిగిన ‘నెయ్యి కల్తీ’ వ్యవహారం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. గత ప్రభుత్వ హయాంలో సరఫరా అయిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలపై సిట్ (SIT) విచారణ సాగిస్తోంది. అయితే, ఈ విచారణ ఇప్పుడు “ముందు నుయ్యి.. వెనుక గొయ్యి” అన్న చందంగా తయారైంది. దేశంలోనే అత్యున్నత ప్రమాణాలున్న గుజరాత్ ‘కాఫ్’ (CALF) ల్యాబ్ ఇచ్చిన నివేదికను కాదని, అరకొర వసతులున్న హరియాణా ‘ఎన్‌డీఆర్‌ఐ’ (NDRI) రిపోర్టును సిట్ ప్రామాణికంగా తీసుకోవడంపై సర్వత్రా విస్తుపోతున్నారు. అసలు గొడ్డు కొవ్వును గుర్తించే శక్తి లేని ల్యాబ్ నివేదికను అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎందుకు నమ్ముతోంది..? ఈ పక్కదారి మళ్ళింపు వెనుక ఉన్న ‘పెద్దల’ హస్తమెవరిది?
శాస్త్రీయతకు పాతర: నివేదికల్లో నిగూఢ సత్యాలు : తిరుమల నెయ్యి కల్తీ కేసులో సిట్ వ్యవహరిస్తున్న తీరు దర్యాప్తు నిష్పాక్షికతపై నీలినీడలు పరుస్తోంది. ఈ వ్యవహారంలోని లోపాలను అంచెలంచెలుగా పరిశీలిస్తే విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూస్తాయి.
ఎన్‌డీడీబీ (NDDB) నివేదికను కాదని.. ఎన్‌డీఆర్‌ఐ (NDRI) ఎందుకు : గుజరాత్‌లోని నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (NDDB)కి చెందిన కాఫ్ ల్యాబ్ అత్యాధునికమైనది. ఆ నెయ్యిలో జంతు కొవ్వులు కలిశాయని ‘ఎస్-వాల్యూ’ ఆధారంగా అది స్పష్టమైన నివేదిక ఇచ్చింది. కానీ సిట్ మాత్రం అంతకంటే తక్కువ సదుపాయాలున్న హరియాణాలోని ఎన్‌డీఆర్‌ఐకి నమూనాలను పంపింది. తమ వద్ద గొడ్డు కొవ్వు, చేప నూనెను పరీక్షించే మెథడాలజీ లేదని ఎన్‌డీఆర్‌ఐ స్వయంగా మొత్తుకున్నా, సిట్ మాత్రం ఆ నివేదికనే ప్రామాణికంగా తీసుకోవడం గమనార్హం.
పీసీఆర్ (PCR) పరీక్ష – పస లేని విధానం: ఎన్‌డీఆర్‌ఐ అనుసరించిన పీసీఆర్ పద్ధతిలో నెయ్యిలో 10 శాతం కంటే ఎక్కువ పంది కొవ్వు ఉంటేనే గుర్తించగలరు. కానీ అధిక వేడిపై కాచి తయారుచేసే నెయ్యిలో డీఎన్‌ఏ డీగ్రేడ్ అవుతుంది. ఫలితంగా కల్తీ పరిమాణం తక్కువగా ఉంటే పీసీఆర్ పరీక్షలో తేలదు. వాస్తవానికి ఒక శాతం కంటే తక్కువ కల్తీని కూడా పసిగట్టే జీసీ-మాస్‌స్పెక్టోమెట్రీ (GC-MS) వంటి అత్యాధునిక విధానాలు అందుబాటులో ఉన్నా, వాటిని విస్మరించడం దర్యాప్తులో ‘గోల్‌మాల్’ జరుగుతోందన్న అనుమానాలకు బలం చేకూరుస్తోంది.
నిందితుల ఇలాఖాలోనే విచారణా : ఈ కేసులో అత్యంత విస్తుగొలిపే అంశం ఏమిటంటే.. కల్తీ నెయ్యి కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు సైంటిస్టులు బత్తుల సురేంద్రనాథ్ (A-35), జయరాజురావు (A-36) గతంలో ఎన్‌డీఆర్‌ఐలోనే ప్రిన్సిపల్ సైంటిస్టులుగా పనిచేశారు. వీరు గత ప్రభుత్వ హయాంలో డెయిరీ ప్లాంట్‌ల తనిఖీ కమిటీలో ఉండి, కల్తీ నెయ్యి సరఫరా చేసే సంస్థలకు అర్హతలున్నట్లు తప్పుడు నివేదికలిచ్చారు. నిందితులు పనిచేసిన సంస్థ ఇచ్చిన నివేదికనే సిట్ సాక్ష్యంగా తీసుకోవడం “కంచే చేను మేసిన చందంగా” తయారైంది.

