Thursday, March 12, 2026
Homeఆంధ్రప్రదేశ్Tirumala Laddu : శ్రీవారి ప్రసాదంలో అపచారం నిజమే.. కానీ నాకేం తెలియదు.. వైవీ సుబ్బారెడ్డి...

Tirumala Laddu : శ్రీవారి ప్రసాదంలో అపచారం నిజమే.. కానీ నాకేం తెలియదు.. వైవీ సుబ్బారెడ్డి వితండవాదం!

Tirumala Laddu ghee adulteration scandal : కోట్లాది మంది హిందువుల ఆరాధ్యదైవం, కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి పవిత్ర ప్రసాదమైన ‘లడ్డు’ విషయంలో జరిగిన ఘోర అపచారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ పాపంలో అప్పటి టీటీడీ పాలకమండలి పాత్రపై సిట్ (SIT) విచారణ సాగుతుండగా, మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు “కంచె చేను మేసినట్లు” ఉన్నాయన్న విమర్శలకు బలాన్నిస్తున్నాయి. “నెయ్యి కల్తీ జరిగింది వాస్తవమే.. కానీ నాకేం తెలియదు” అంటూ ఆయన దిల్లీ వేదికగా వినిపిస్తున్న చిలకపలుకులు భక్తులను విస్మయానికి గురిచేస్తున్నాయి. 

- Advertisement -

సిట్ తేల్చింది ఒకటి.. వైవీ చెప్పేది మరొకటి : శ్రీవారి లడ్డు తయారీలో వాడే నెయ్యిని రసాయనాలతో, పామాయిల్ వంటి ఇతర నూనెలతో కల్తీ చేసినట్లు సిట్ నిర్ధారించిందని సుబ్బారెడ్డి అంగీకరించారు. అయితే, అక్కడే ఆయన ఒక మెలిక పెట్టారు. నెయ్యిలో జంతు కొవ్వులు కలిసినట్లు ఎక్కడా లేదని బుకాయించే ప్రయత్నం చేశారు. కానీ, ఎన్​డీడీబీ (NDDB) ఇచ్చిన నివేదికలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె కలిసే అవకాశం ఉందని స్పష్టంగా పేర్కొంది. “హత్య జరిగింది వాస్తవమే కానీ.. నేను కత్తితో పొడిస్తే తుపాకీతో చంపారనడం తప్పు కదా” అని దబాయించినట్లుగా ఆయన వాదన ఉందని విశ్లేషకులు మండిపడుతున్నారు.

భోలేబాబా డెయిరీపై కరుణ ఎందుకు : కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నారని ల్యాబ్ పరీక్షల్లో తేలినప్పటికీ, 2022 ఆగస్టులో భోలేబాబా డెయిరీకి లక్షల కిలోల నెయ్యి సరఫరా చేసేందుకు ఆర్డర్లు ఇవ్వడం వెనుక ఉన్న ‘అదృశ్య హస్తం’ ఎవరిది? నాణ్యత లేని నెయ్యిని పంపిన సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టాల్సింది పోయి, మళ్లీ మళ్లీ అవకాశాలు ఇవ్వడం వెనుక భారీ స్థాయిలో కమీషన్లు చేతులు మారాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీ.ఎఫ్​.టీ.ఆర్​.ఐ నివేదికలు వచ్చినా వాటిని ఎందుకు తొక్కిపెట్టారు? అనే ప్రశ్నకు ఆయన వద్ద జవాబు లేదు.

చిన్నప్పన్న.. ఒక సాధారణ ఉద్యోగికి అంత పవరా : వైవీ సుబ్బారెడ్డి పీఏగా ప్రచారంలో ఉన్న చిన్నప్పన్న అనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగి వ్యవహారం ఇప్పుడు ఈ కేసులో కీలక మలుపు. ఆయన తన పీఏ కాదని వైవీ వితండవాదానికి దిగుతున్నారు. ఒక సామాన్య ఉద్యోగి టీటీడీ ఇన్‌స్పెక్షన్ కమిటీని ప్రభావితం చేసి, డెయిరీ ప్రతినిధులను దిల్లీకి పిలిపించి కిలోకి రూ. 25 లంచం అడిగే స్థాయికి ఎలా వెళ్లారు? ఆయన వ్యక్తిగత ఖాతాలోకి రూ. 4.5 కోట్లు ఎలా వచ్చాయన్న దానికి వైవీ సమాధానం దాటవేస్తున్నారు. రాజకీయ అండదండలు లేకుండా ఇదంతా సాధ్యమేనా?

పారదర్శకతకు పాతర.. లైవ్ కట్ : వైవీ సుబ్బారెడ్డి హయాంలో టీటీడీ బోర్డు మీటింగులు ఒక వ్యాపార వేలం పాటలా మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఆర్జిత సేవల టికెట్ల ధరల పెంపుపై జరిగిన చర్చలను లైవ్‌లో చూసిన భక్తులు ఛీత్కరించుకోవడంతో, ఆ తర్వాత నుంచి సమావేశాల ప్రత్యక్ష ప్రసారాన్ని నిలిపివేశారు. చివరకు ఎజెండాను కూడా వెబ్‌సైట్‌లో పెట్టకుండా గోప్యంగా ఉంచడం దేనికి సంకేతం? నిజంగానే అంతా పారదర్శకంగా ఉంటే భక్తులకు ఎందుకు దూరం పెట్టారు? ఈ కల్తీ భాగోతంపై సిట్ విచారణ ముగిస్తే గానీ, శ్రీవారి చెంత జరిగిన ఈ మహాపాపంలో ఎవరెవరికి ఎంత వాటా ఉందో, ఎవరెవరు అడ్డంగా బుక్కయ్యారో పూర్తిస్థాయిలో వెలుగులోకి రాదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News