Tirumala Ghat Road: తిరుమలలోని ఏడు కొండలు అంటే హిందువులకు ఎంతో పవిత్రం. ఆలయంతో పాటు ఆ కొండల్లోని ప్రతి అడుగు గోవిందనామంతో నిత్యం ప్రతిధ్వనిస్తోంది. ఎన్ని కష్టాలు ఉన్నా ఒక్కసారి ఆ శ్రీవారిని దర్శించుకుంటే చాలు అన్ని ప్రాబ్లమ్స్ పోతాయని నమ్మకం. అలాంటి పవిత్రమైన కొండపైన.. మొదటి ఘాట్ రోడ్డులో ఓ ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. తిరుమలలోని మోకాళ్ల పర్వతానికి సమీపంలోని అవ్వాచారి కోన వద్ద ఓ భక్తుడు కొండపై నుంచి దూకేశాడు. ఈ ఘటన కొండపై ఉన్న భక్తులను కలవరానికి నెట్టేసింది.
లోయలోకి దూకిన వ్యక్తిని గమనించి భక్తులు.. అధికారులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్.. ఆ వ్యక్తిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమించారు. అయితే ఆ లోయ చాలా లోతుగా ఉండడంతో పాటు చాలా దట్టంగా ఉంది. ఈ క్రమంలో భక్తుడ్ని బయటకు తీసుకురావడం తిరుమల రెస్క్యూ టీమ్‌కు పెద్ద సవాలుగా మారింది.
ప్రాణాలకు తెగించి మరీ లోయలోకి దూకిన రెస్క్యూ టీమ్ పెద్దపెద్ద తాళ్ల సాయంతో అతడ్ని బయటకు తీసుకొచ్చారు. నడవలేని స్థితిలో ఉన్న అతడ్ని తాళ్లు కట్టి బయటకు లాగారు. వెంటనే తిరుమలలోని అశ్విని ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. అయితే అతను ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారనే విషయం తెలియరాలేదు. ఈ క్రమంలో భక్తుడ్ని ప్రాణాలు లెక్కచేయకుండా కాపాడిన రెస్క్యూ టీమ్‌పై భక్తులు ప్రశంసలు కురిపిస్తున్నారు.


