Sunday, February 8, 2026
Homeఆంధ్రప్రదేశ్Tirumala: పార్వేట ఉత్సవానికి ముస్తాబైన తిరుమల.. కనుమ నాడే మృగయ ఉత్సవం!

Tirumala: పార్వేట ఉత్సవానికి ముస్తాబైన తిరుమల.. కనుమ నాడే మృగయ ఉత్సవం!

Tirumala Parveta Utsavam: తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి ఏటా సంక్రాంతి పర్వదినం ముగింపు సందర్భంగా నిర్వహించే ‘పార్వేట ఉత్సవం’ అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ ఏడాది జనవరి 16న కనుమ పండుగను పురస్కరించుకుని ఈ వేడుకను కనుల పండువగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

- Advertisement -

గోదా పరిణయోత్సవం – ఆండాళ్ అమ్మవారి పూలమాలలు
కనుమ రోజున ఉదయం నుంచే ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. శ్రీ విష్ణుచిత్తుల కుమార్తె అయిన ఆండాళ్ అమ్మవారు (గోదాదేవి) స్వామివారిపై భక్తితో ధరించిన పూలమాలలను పెద్దజీయర్ మఠం నుంచి మంగళవాయిద్యాల మధ్య ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకువస్తారు. ఉదయం 5:30 నుండి 6:30 గంటల మధ్య ఈ మాలలను స్వామివారికి సమర్పించడంతో ‘గోదా పరిణయోత్సవం’ ఘనంగా జరుగుతుంది.

Also Read:AP Set : – ఉన్నత విద్యకు వేళాయే.. ‘సెట్ల’కు సారథుల నియామకం!

పార్వేట ఉత్సవం విశిష్టత
మధ్యాహ్నం 1:00 గంటకు శ్రీమలయప్ప స్వామివారు, శ్రీకృష్ణ స్వామివారితో కలిసి పల్లకీపై తిరుమల కొండల్లోని పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. పురాణాల ప్రకారం, స్వామివారు దుష్టశిక్షణ కోసం వేటకు వెళ్లడాన్ని స్మరిస్తూ ఈ ‘మృగయ ఉత్సవం’ నిర్వహిస్తారు. అక్కడ కొలువు దీరిన స్వామివారికి ఆస్థానం నిర్వహించి, అనంతరం భక్తులకు దర్శనమిస్తూ తిరిగి ఆలయానికి చేరుకుంటారు.

ఆర్జిత సేవలు రద్దు
ఈ భారీ ఉత్సవాల దృష్ట్యా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జనవరి 16న శ్రీవారి ఆలయంలో నిర్వహించే పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. వాటిల్లో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ ఉన్నాయి. భక్తులు ఈ మార్పులను గమనించి, కనుమ రోజున స్వామివారి పార్వేట ఉత్సవ వైభవాన్ని దర్శించుకోవాలని అధికారులు కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News