Srivari Pavitrotsavam: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు టీటీడీ సువర్ణావకాశాన్ని కల్పిస్తోంది. స్వామివారి ఆలయంలో ప్రతి ఏటా నిర్వహించే పవిత్రోత్సవాల సందర్భంగా.. ఒకే టికెట్‌పై వరుసగా మూడు రోజుల పాటు శ్రీవారి మూలమూర్తిని దర్శించుకునే భాగ్యాన్ని భక్తులకు కల్పించనుంది.
ఉత్సవాల ప్రాశిష్ట్యం: ఏడాది పొడవునా ఆలయంలో జరిగే నిత్య కైంకర్యాలు, అర్చనలు, ఉత్సవాల్లో భక్తులు లేదా ఆలయ సిబ్బంది వల్ల తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి భంగం కలగకుండా.. ఆగమశాస్త్రం ప్రకారం దోష నివారణ కోసం ఈ పవిత్రోత్సవాలను టీటీడీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తుంది. ఈ ఏడాది ఆగస్టు 23 నుంచి 25వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. దీనికి ముందుగా ఆగస్టు 22న అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
టికెట్ల వివరాలు: తిరుమల తిరుపతి దేవస్థానం కల్పిస్తున్న ఈ సువర్ణావకాశాన్ని పొందాలనుకునే భక్తులకు ఈ నెల 21న టీటీడీ ప్రత్యేకంగా టికెట్లను ఆన్‌లైన్‌లో జారీచేస్తుంది. ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసే ఈ టికెట్‌ను ఇద్దరికీ కలిపి రూ.5,000 చెల్లించి కొనుగోలు చేయొచ్చు. టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
Also read-Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం!
భక్తులకు లభించే సేవలు: ఈ సేవ టికెట్లు పొందిన భక్తులు పవిత్రోత్సవాలు జరిగే మూడు రోజుల పాటు స్నపన తిరుమంజనం సేవలో, అలాగే చివరి రోజు నిర్వహించే పూర్ణాహుతి క్రతువులో పాల్గొనవచ్చు. టికెట్లు పొందిన భక్తులు నిర్ణీత రోజుల్లో ఉదయం 7 గంటలకల్లా సంప్రదాయ వస్త్రధారణతో వైకుంఠం క్యూకాంప్లెక్స్-1 వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. రిపోర్టింగ్ సమయంలో భక్తులు తమ వెంట ఏదైనా ఒక ప్రభుత్వ అధికారిక ఫొటో గుర్తింపు కార్డును (ID Proof) తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది.

