Monday, March 9, 2026
Homeఆంధ్రప్రదేశ్TTD: శ్రీవారి ఆలయం మూసివేత..భక్తులకు టీటీడీ అలర్ట్‌!

TTD: శ్రీవారి ఆలయం మూసివేత..భక్తులకు టీటీడీ అలర్ట్‌!

Tirumala Temple Closed:తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక సమాచారం విడుదల చేసింది. మార్చి 3వ తేదీన సంభవించే సంపూర్ణ చంద్రగ్రహణాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీవారి ఆలయంలో సాధారణంగా నిర్వహించే పలు దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. గ్రహణ ప్రభావం కారణంగా ఆ రోజున వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలు పూర్తిగా రద్దు చేయబడినట్లు తెలిపారు.

- Advertisement -

ఇవాళ రాత్రి వరకు మాత్రమే..

అలాగే ఇవాళ రాత్రి వరకు మాత్రమే భక్తులను క్యూ లైన్లలోకి అనుమతించనున్నారు. సర్వదర్శనం కోసం ఇవాళ తిరుపతిలో జారీ చేయాల్సిన టోకెన్లను కూడా రద్దు చేసినట్లు టీటీడీ స్పష్టం చేసింది. దాంతో టోకెన్ లేని భక్తులు దర్శనం కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తుందని అధికారులు ముందస్తు హెచ్చరిక జారీ చేశారు.

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/andhra-pradesh-records-high-temperatures-in-march/

సంపూర్ణ చంద్రగ్రహణం…

టీటీడీ ఇచ్చిన వివరాల ప్రకారం, మార్చి 3న ఉదయం 9 గంటల నుండి రాత్రి 7 గంటల 30 నిమిషాల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. ఈ సమయంలో ఎటువంటి దర్శనాలు నిర్వహించరు. సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఆలయంలో దర్శనాలను పూర్తిగా నిలిపివేస్తున్నారు.

ఆలయ శుద్ధి కార్యక్రమాలు …

గ్రహణం ముగిసిన అనంతరం ఆలయ శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు. పుణ్యాహవాచనం సహా సంప్రదాయ వైదిక క్రతువులు పూర్తయిన తర్వాత మాత్రమే భక్తులకు తిరిగి దర్శనాన్ని అనుమతిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు భక్తులు వేచి ఉండాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

ముందుగానే తెలుసుకుని..

దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు ఈ మార్పులను గమనించి తమ ప్రయాణ ప్రణాళికలను సవరించుకోవాలని టీటీడీ సూచించింది. ఆలయం మూసివేత సమయాలను ముందుగానే తెలుసుకుని తిరుమలకు రావాలని అధికారులు తెలిపారు. గ్రహణ కాలంలో ఆహారం తీసుకోకపోవడం, దైవ నామస్మరణ చేయడం వంటి ఆచారాలను పాటించాలని పండితులు సూచిస్తున్నారు.

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/andhra-pradesh-tightens-teacher-attendance-rules/

సుమారు 12 గంటల వరకు..

మరోవైపు, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు ఇప్పటికే నిండిపోయాయి. అక్కడి నుంచి బయట వరకు క్యూ లైన్లు కొనసాగుతున్నాయి. టోకెన్ లేకుండా వచ్చిన భక్తులకు సర్వదర్శనం కోసం సుమారు 12 గంటల వరకు వేచి ఉండాల్సి వస్తోంది.

గత రోజు శ్రీవారిని మొత్తం 83 వేల 122 మంది భక్తులు దర్శించుకున్నట్లు టీటీడీ వెల్లడించింది. వారిలో 30 వేల 54 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. అదే రోజు హుండీ ద్వారా 4.49 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News