Tirumala Tirupati Devasthanams Brahmotsavam 2025:తిరుమల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేటి (ఆదివారం) సాయంత్రం గరుడ వాహనసేవ ప్రారంభమైంది. ఈ బ్రహోత్మవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో వాహనాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో అలిపిరిలో భారీ రద్దీ నెలకొంది. అలిపిరి టోల్‌గేట్ వద్ద వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం భక్తులను అనుమతిస్తున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ దృష్ట్యా శ్రీనివాసుడి గరుడ సేవను కనులారా వీక్షించేందుకు శనివారం రాత్రి నుంచే భక్తులు నిరీక్షిస్తున్నారు. పలువురు భక్తులు గ్యాలరీల్లోనే నిద్రించారు. వారికి టీటీడీ సిబ్బంది పాలు, బిస్కెట్లు అందజేశారు. 4 మాడ వీధుల్లో పర్యవేక్షణకు 64 మంది ప్రత్యేక సిబ్బంది, 14 మంది ప్రత్యేక అధికారులను టీటీడీ నియమించింది. కాగా, అంచనాలకు మించి భక్తులు పోటెత్తడంతో రద్దీని నియంత్రించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల కొండపైకి ప్రైవేట్ వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. దీంతో, అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గాల ద్వారా భక్తులు కాలినడకన పెద్ద సంఖ్యలో కొండపైకి చేరుకుంటున్నారు. దీంతో తిరుమల క్షేత్రంగోవింద నామస్మరణతో మార్మోగుతోంది. కొండపైకి చేరుకోవాలనుకునే భక్తులు తప్పనిసరిగా ఆర్టీసీ బస్సులను మాత్రమే ఆశ్రయించాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో అలిపిరి వద్ద వేలాది వాహనాలు నిలిచిపోయాయి. తద్వారా తిరుపతిలోని సప్తగిరి తనిఖీ కేంద్రం నుంచి గరుడ సర్కిల్ వరకు భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఇప్పటికే పార్కింగ్ ప్రదేశాలన్నీ దాదాపు 4,000 వాహనాలతో నిండిపోయినట్లు సమాచారం.
అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు..
మరోవైపు, గరుడ వాహనంపై శ్రీవారిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తిరుమలకు చేరుకున్నారు. దీంతో, తిరుమాడ వీధుల్లోని గ్యాలరీలన్నీ పూర్తిగా నిండిపోయాయి. గ్యాలరీలు కిక్కిరిసిపోవడంతో భక్తులను మాడ వీధుల్లోకి అనుమతించడం లేదు. నందకం, రామ్ భగీచా, లేపాక్షి సర్కిళ్ల వరకు భక్తులు బారులు తీరిన పరిస్థితి కనిపిస్తోంది. సెప్టెంబర్ 2న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు.. అక్టోబర్ 2 వరకు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలోనే రేపు (సెప్టెంబర్ 29) ఉదయం 8 గంటలకు హనుమంత వాహన సేవ నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథంపై భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం రాత్రి 7 గంటలకు గజ వాహన సేవ ఉంటుంది. ఇక, సెప్టెంబర్ 30 ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహన సే నిర్వహిస్తారు. సెప్టెంబర్ 1 ఉదయం 7 గంటలకు రథోత్సవం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు అశ్వ వాహనం మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిస్తారు. బ్రహ్మోత్సవాల చివరి రోజైన సెప్టెంబర్ 2 ఉదయం 6 నుండి 9 వరకు చక్రస్నానం నిర్వహిస్తారు. అదే రోజు రాత్రి 8:30 నుంచి 10 గంటల వరకు ధ్వజావరోహణం నిర్వహిస్తారు. అంతటితో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.


