Today Weather Forecast updates: నైరుతి బంగాళాఖాతం నుంచి తమిళనాడు మీదుగా కేరళ వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. దాని ప్రభావంతో బంగాళాఖాతం నుంచి తేమ గాలులు వీయడంతో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. మిగిలిన చోట్ల మాత్రం ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. ప్రకాశం జిల్లా బి.చెర్లోపల్లిలో 6.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శ్రీసత్యసాయి జిల్లా గాండ్లపెంటలో 4.5 సెం.మీ., నెల్లూరు జిల్లా కండలేరులో 4 సెం.మీ., విజయవాడ తూర్పులో 3.9 సెం.మీ. వర్షపాతం నమోదైంది. నెల్లూరులో మాత్రం సాధారణం కంటే ఎక్కువ ఉష్టోగ్రత అనగా.. 34.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.
ఉరుములు, మెరుపుల హెచ్చరిక: రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల, ఉత్తర కోస్తాలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. నేడు అక్కడక్కడ అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మిగతా జిల్లాల్లో అయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Also Read:https://teluguprabha.net/andhra-pradesh-news/today-ap-weather-forecast-updates/
తీరంలో పిడుగుల వర్షం: కర్ణాటక రాష్ట్రంలోని కరావళి ప్రాంతంలోని దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లో బుధవారం ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు ప్రారంభమయ్యాయి. బీదర్, కలబురగి, రాయచూరు, కొప్పళ, బళ్లారి, చిత్రదుర్గ, తుమకూరు, చిక్కబళ్లాపుర, కోలారు, బెంగళూరు గ్రామీణ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను భారత వాతావరణ శాఖ ప్రకటించింది. బెంగళూరు, మైసూరు, మండ్య, చామరాజనగర, హాసన, శివమొగ్గ, చిక్కమగళూరు, దావణగెరె, విజయనగర, కొడగు జిల్లాల్లో తేలికపాటి వర్షం కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. తీరప్రాంతంలో మత్య్సకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. దీపావళి అనంతరం కర్ణాటకలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగిపోయిన క్రమంలో వానలు మొదలయ్యాయి. వర్షం కురుస్తున్న సమయంలో చెట్ల కింద వాహనాలు నిలపడం, నిలబడడం చేయవద్దని కర్ణాటక విపత్తు నిర్వహణ దళం స్థానిక పౌరులకు సూచించింది.


