Weather Forecast updates: ఏపీలో రానున్న రెండు రోజులు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో ఈ వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయని తెలిపారు. మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతుండడంతోనే రాష్ట్రంలో చెదురుమదురు వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అంతే కాకుండా ఉత్తర తమిళనాడు తీర పరిసర ప్రాంతాల్లో సగటు సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో మరో ఉపరితల ఆవర్తనం ఉందని వాతావరణశాఖ వివరించింది. దీని ప్రభావంతో తీరప్రాంతం, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు పడనున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. తూర్పుమధ్య బంగాళాఖాతంలో ఉన్న మరో అల్పపీడనం వాయవ్యంగా పయనించి మంగళవారానికి ఈశాన్య బంగాళాఖాతంలో ప్రవేశించే క్రమంలో తీవ్ర అల్పపీడనంగా మారిందన్నారు. అయితే ఇది బంగ్లాదేశ్ వైపు పయనిస్తున్నందున దీని ప్రభావం ఏపీపై అంతగా ఉండదని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు.
పిడుగులతో కూడిన వర్షాలు: ఈ ఉపరితల ఆవర్తనం కారణంగా నేడు కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, తిరుపతిలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు. శుక్రవారం నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.
Also Read:https://teluguprabha.net/telangana-news/today-telangana-weather-forecast-updates/
ప్రజలకు హెచ్చరికలు: ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో ప్రజలు చెట్ల కింద నిలబడవద్దని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు సూచించారు. పిడుగులు పడే సమయంలో సురక్షిత ప్రాంతాలలో ఉండాలని అన్నారు. ముఖ్యంగా రైతులు, కూలీలు పొలాల్లో జాగ్రత్తగా ఉండాలని కోరారు.


