Weather Forecast: మొంథా తుపానుప్రభావంతో జరిగిన నష్టాల నుంచి ప్రజలు ఇంకా తేరుకొనేలేదు. ఇంతలోనే మళ్లీ కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. రాష్ట్రంలో అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఉరుముల సమయంలో చెట్ల కింద నిలబడవద్దని, సేఫ్ ప్లేసుల్లో ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.
వేటకు వెళ్లరాదని హెచ్చరిక: మరోవైపు.. ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలతో ప్రకాశం బ్యారేజీవద్ద కృష్ణానదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. మరికొద్దిరోజులు కృష్ణానదికి వరద వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ వద్ద అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజీకి ఇన్‌ఫ్లో 5.67 లక్షల క్యూసెక్కులుగా ఉంది. కృష్ణా నది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మరోవైపు.. ప్రకాశం బ్యారేజీ వైపు వెళ్తున్న బోటును ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెంలో స్థానికులు అడ్డుకున్నారు. అధికారుల సాయంతో బోటును ఒడ్డుకు చేర్చారు. గతంలో బ్యారేజీ గేట్ల వద్ద బోట్లు ఇరుక్కున్న సంఘటనలు గుర్తుంచుకుని స్థానికులు జాగ్రత్తలు తీసుకున్నారు. వరద ప్రవాహం తగ్గేంత వరకూ నదిలో వేటకు వెళ్లరాదని స్థానిక మత్స్యకారులను అధికారులు హెచ్చరించారు.
Also Read:https://teluguprabha.net/andhra-pradesh-news/amaravati-krishna-rising-flood-levels-of-krishna-river/
నష్ట నివారణ చర్యలను చేపట్టాలి: మొంథా తుపాను ప్రభావంతో రైతులు భారీ నష్టాన్ని చవి చూశారని వైకాపా నేత డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అన్నారు. రైతుల కష్టాలను తగ్గించి, ఆర్థిక నష్టాన్ని నియంత్రించేందుకు తక్షణమే నష్ట నివారణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. అనపర్తి మండలం కొప్పవరం గ్రామంలో పర్యటించిన ఆయన తుపాను కారణంగా దెబ్బతిన్న వరి చేన్లను పరిశీలించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో రైతులకు ఉచిత భీమాతో భరోసా ఉండేదని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో అన్నదాతలకు భరోసా కరువైందని సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పంట నష్టానికి తగిన పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. తద్వారా పంట నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని కోరారు.


