రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అన్నారు. మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి జల్లులు కురిసే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆకస్మికంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున వర్షం పడే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల కింద నిలబడకూడదని తెలిపారు.
నదీ పరివాహక ప్రాంతాలు: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణానదికి వరద వస్తుంది. ఈ ప్రవాహం మరికొద్దిరోజులపాటు ఉండే అవకాశం ఉంది. కాబట్టి నదీపరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పొంగిపొర్లుతున్న వాగులు, కాలువలు, డ్రైనేజీలను దాటేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించవద్దని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ సూచించారు.
Also Read:https://teluguprabha.net/andhra-pradesh-news/today-ap-weather-report/
ప్రకాశం బ్యారేజీ తాజా పరిస్థితి: ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. శనివారం సాయంత్రం 5 గంటల వరకు బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో (నీటి రాక) 1,67,175 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో (నీటి విడుదల) కూడా అంతే నమోదైంది. కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. వరద ప్రవాహం తగ్గేంత వరకూ నదిలో వేటకు వెళ్లరాదని స్థానిక మత్స్యకారులను అధికారులు హెచ్చరించారు.


