CM Chandrababu Foreign trip: వ్యక్తిగత పర్యటనలో భాగంగా సతీమణి భువనేశ్వరితో కలిసి ఏపీ సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి లండన్‌కు బయల్దేరి వెళ్లనున్నారు. ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ, హెరిటేజ్ ఫుడ్స్ ఎండీ భువనేశ్వరికి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (ఐవోడీ) సంస్థ నవంబరు 4న డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్-2025 అవార్డు అందించనున్న నేపథ్యంలో ఈ పర్యటన ఖరారు అయ్యింది. అంతే కాకుండా హెరిటేజ్ ఫుడ్స్‌కు ఎక్స్‌లెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో లభించిన గోల్డెన్ పీకాక్ అవార్డును సైతం అదే వేదికపై భువనేశ్వరి అందుకోనున్నట్టుగా తెలుస్తోంది. లండన్‌లోని గ్లోబల్ కన్వెన్షన్‌లో జరిగే ఈ కార్యక్రమానికి చంద్రబాబు సతీసమేతంగా హాజరవుతారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, హిందూజా గ్రూప్ కో చైర్మన్ గోపీచంద్, ఆదిత్య బిర్లా సెంటర్ ఫర్ కమ్యూనిటీ ఇనీషియేటివ్స్ చైర్‌పర్సన్ రాజశ్రీ బిర్లా, సన్ ఫార్మా ఎండీ దిలీప్ సంఘ్వీ, గోయెంకా గ్రూప్ సంస్థల చైర్మన్ సంజీవ్ గోయెంకా వంటి ప్రముఖులు గతంలో ఈ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపార, సామాజిక, పరిపాలనా రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులు పాల్గొంటారు.
పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ: లండన్ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అంతేకాకుండా విశాఖలో నవంబరు 14, 15 తేదీల్లో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు పలువురు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి లండన్‌లోని పారిశ్రామికవేత్తలు, పలువురు ప్రవాసాంధ్రులతో సీఎం భేటీ కానున్నారు. అనంతరం నవంబరు 6న సీఎం తిరిగి రాష్ట్రానికి రానున్నారు.
ప్రజాసేవకు పట్టం: ప్రజాసేవ, సామాజిక ప్రభావం అంశాల్లో చేసిన కృషికి గాను ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అంతర్జాతీయ ఖ్యాతి పొందారు. భారత్‌లోని ప్రముఖ సంస్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ నారా భువనేశ్వరిని డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు-2025కు ఎంపిక చేసింది. ప్రజాసేవ, సామాజిక ప్రభావం, నాయకత్వం వంటి అంశాల్లో విశేష కృషి చేసిన వ్యక్తులను ప్రతి ఏటా ఈ అవార్డులను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ ఎంపిక చేస్తుంది. ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో.. విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత, విపత్తు సాయం తదితర అంశాల్లో సేవా కార్యక్రమాలను నారా భువనేశ్వరి నిర్వహిస్తోంది.


