Weather Forecast Update: బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు రాబోయే రెండు లేదా మూడు రోజుల్లో ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాల నుంచి పూర్తిగా వెనుదిరిగే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. అంతే కాకుండా ఈశాన్య రుతుపవనాల ఆగమనం ఉంటుందని అధికారులు తెలిపారు. ఇలా నైరుతి నిష్క్రమణ, ఈశాన్య రుతుపవనాల ఆగమనం ఏకకాలంలో జరుగుతుండటంతో.. ఈ నెలాఖరు వరకు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవొచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. నేడు మహబూబాబాద్, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ-గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉందని వాతారణ శాఖ పేర్కొంది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఏపీలో భారీ వర్షాలు: నైరుతి బంగాళాఖాతం, దక్షిణ తమిళనాడు తీరం వెంబడి ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉండడంతో.. ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. ముఖ్యంగా దక్షిణ కోస్తాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడనుందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం స్పష్టం చేసింది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
తీర ప్రాంత ప్రజలు అప్రమత్తం: కోస్తాంధ్ర పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని ప్రభావంతో గురువారం వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశముందని పేర్కొంది. దక్షిణ కోస్తా ప్రాంతంలోని బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు మరియు తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. అంతే కాకుండా ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రాగల 24 గంటలపాటు మత్స్యకారులు వేటకు సైతం వెళ్లరాదని తుఫాన్ హెచ్చరికల కేంద్ర ముఖ్య అధికారి శ్రీనివాస్ తెలిపారు.
పిడుగుల హెచ్చరిక: ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు ప్రజలు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.


