Earthquake in AP: ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో స్వల్ప భూకంపం వచ్చింది. దీని ప్రభావంతో విశాఖపట్నంలోని స్వల్ప ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర కలవరపాటుకు గురయ్యారు. తెల్లవారుజామున సుమారు 4 గంటల నుంచి 4:30 గంటల మధ్య పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. భూ ప్రకంపనలు కొన్ని సెకన్ల పాటు కొనసాగాయి.
రిక్టర్ స్కేలుపై 3.7గా నమోదు: ముఖ్యంగా గాజువాక, మధురవాడ, రుషికొండ, భీమిలి, కైలాసపురం, మహారాణిపేట, విశాలాక్షినగర్, అక్కయ్యపాలెం తదితర ప్రాంతాల్లో ప్రజలు ప్రకంపనలను గుర్తించారు. కొందరి నివేదికల ప్రకారం, ప్రకంపనల వేళ కొన్ని చోట్ల శబ్దాలు కూడా వినిపించినట్లు స్థానికులు వెల్లడించారు. అయితే ఇది రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.7గా నమోదైంది. దీంతో ఇది స్వల్ప భూకంపంగానే అధికారులు తెలిపారు. జి.మాడుగుల సమీపంలో 10 కి.మీ లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
భీమిలి బీచ్ రోడ్‌లో పెద్ద శబ్దం: భూకంప తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ.. ఈ హఠాత్పరిణామంతో విశాఖ ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. చాలా ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భీమిలి బీచ్ రోడ్‌లో పెద్ద శబ్దంతో భూమి కంపించింది. సింహాచలంలోనూ స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నట్టుగా స్థానికులు తెలిపారు. దీంతో ఇళ్ల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. అయితే భూ ప్రకంపనల కారణంగా ఎలాంటి ఆస్తి నష్టం గానీ, ప్రాణ నష్టం గానీ జరగకపోవడంతో అంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.


