weather Forecast Update: ఆంధ్రప్రదేశ్‌లోని ఓ నగరంలో మంగళవారం కనిపించిన ఆకాశ అద్భుతం పలవురిని ఆకట్టుకుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఏలూరు పట్టణంలో సూర్యుని చుట్టూ ఓ వలయం ఏర్పడినట్లుగా కనిపించింది. ఇది చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. రానున్న రోజుల్లో వానలు కురుస్తాయనేందుకు ఈ వలయం సంకేతమని.. ఆంధ్ర విశ్వవిద్యాలయం వాతావరణ విభాగం విశ్రాంత ఆచార్యులు భానుకుమార్ తెలిపారు.
సిర్రస్ మేఘాలే కారణం: మేఘాల్లోని సూక్ష్మ మంచు తుంపర్లతో కాంతి వక్రీభవనం చెందడం వల్లనే ఇలా ఏర్పడుతుందని భానుకుమార్ తెలిపారు. భూమికి సుమారు 20 నుంచి 30 వేల అడుగుల ఎత్తులో ఉండే తెల్లని సిర్రస్ మేఘాలలో సూక్ష్మ మంచు స్ఫటికాలు మిలియన్ల కొద్ది ఉంటాయని అన్నారు. అవి సూర్యకాంతితో వక్రీభవనం చెందడంతో వలయం ఏర్పడుతుందని తెలిపారు. ఇది వర్షాలకు సంకేతమని భానుకుమార్ అన్నారు.
మరో మూడు రోజులు: బంగాళాఖాతం తీరంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో మరో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో రాబోయే రోజుల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉపరితల ద్రోణి ఏపీలోని ఉత్తర కోస్తా, ఒడిశా నుంచి తూర్పు తెలంగాణ వరకు అలాగే దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా కొనసాగుతోందని అన్నారు. ఇది సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నట్లుగా అంచనా వేశారు. దీని కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.


