weather Forecast Update: ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉన్నట్లు భారత వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. తదుపరి 48 గంటల్లో ఈ అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ దక్షిణ మధ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
ఏపీలో భారీ వర్షాలు: ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాగల మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేటప్పుడు ప్రజలు చెట్ల కింద నిల్చోవద్దని అధికారులు తెలిపారు.
తెలంగాణలో వెదర్ రిపోర్ట్: తెలంగాణ వాతావరణంలో కొంత మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉదయం కొంత చలితీవ్రత పెరిగింది. మధ్యాహ్న వేళలో పొడి వాతావరణంతో కూడిన ఎండ ఉంటుంది. రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాలకు తెలికపాటి వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ వంటి తూర్పు జిల్లాలతో పాటు దక్షిణ జిల్లాలైన నాగర్‌కర్నూల్, వనపర్తి, నల్గొండ వంటి ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇక హైదరాబాద్ నగరంలో రాత్రి వేళల్లో వాతావరణం చల్లబడి, తేలికపాటి జల్లులు పడే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు.


