Tomato price: గత కొంతకాలంగా టమాటా ధర భారీగా తగ్గుతూ వస్తుంది. సీజన్ బట్టి ఆకాశాన్ని అంటే టమాటా ధర ప్రస్తుతం రైతు ఊహించని విధంగా తగ్గింది. దీంతో దళారులు రైతన్నను నిట్టనిలువునా ముంచేస్తున్నారు.
హైవేపై టమాటా కుప్పలు: టమాటా దిగుబడి అధికంగా పెరగడంతో మార్కెట్‌లో డిమాండ్ తగ్గింది. దీంతో ధరలు భారీగా పతనమయ్యాయి. పండించిన పంటకు కనీసం పెట్టుబడి కూడా రాకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులు తమ ఆవేదనను వినూత్న రీతిలో వ్యక్తం చేస్తున్నారు. కందుకూరు సమీపంలో గల శ్రీశైలం ప్రధాన రహదారిపై రైతులు టమాటాలను కుప్పలుగా పారబోశారు. వాహనాల రాకపోకలు సాగే రోడ్డుపై టమాటాలను పారబోసి ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేశారు. ప్రస్తుతం మార్కెట్‌లో 25 కిలోల టమాటా బాక్స్ ధర కేవలం రూ. 80 నుంచి రూ. 100 వరకు మాత్రమే పలుకుతోంది. అంటే కిలో టమాటా ధర రూ. 4 కు పడిపోయింది. దీంతో టమాటా రైతులు కోలుకోని నష్టాన్ని చవిచూసే పరిస్థితి ఏర్పడింది.
కూలీ ఖర్చులు సైతం రావడం లేదు: ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే.. ఇప్పుడు కనీసం కోత కూలీలు రావడం లేదని రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నార. మార్కెట్‌కు తీసుకెళ్లే రవాణా ఖర్చులు కూడా రావడంలేదని రైతులు కన్నీరుమున్నీరయ్యారు. మార్కెట్‌కు తీసుకెళ్తే అదనపు భారం పడుతుండడంతో ఇక చేసేదేమీ లేక ఇలా రోడ్డుపై పారబోస్తున్నామని రైతులు తెలిపారు.
Also read-Weather report: పొంచి ఉన్న అకాల వర్షాలు.. మామిడి రైతుల్లో ఆందోళన!
ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్: భారీగా పడిపోయిన ధరల వల్ల అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉందని రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా తమను ఆదుకోవాలని కోరారు.

