ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పర్యాటక విధానం(New tourism policy)2024-29తో దేశంలో ఎక్కడా లేని విధంగా ఆతిథ్య రంగంలో అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని ఇన్వెస్టర్లతో పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తొలి రోజు 30 కంపెనీలతో భేటీ అయిన మంత్రి కందుల దుర్గేష్, పర్యాటక శాఖ సెక్రటరీ అజయ్ జైన్, టూరిజం ఎండీ ఆమ్రపాలి కాట బృందం రెండో రోజు పర్యటనలో భాగంగా గురువారం ముంబయిలోని ది వెస్టిన్ ముంబయి పోవై లేక్ లో ఏప్రిల్ 8-10 వరకు జరిగిన దక్షిణాసియా 20వ హోటల్ ఇన్వెస్ట్ మెంట్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న 15 జాతీయ, అంతర్జాతీయ ప్రఖ్యాత హోటల్స్ గ్రూప్స్, ట్రావెల్స్ కంపెనీల ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

ప్రధానంగా ఆస్కాట్, అకార్ హోటల్స్, వెల్ నెస్ రిసార్ట్స్ లో పేర్గాంచిన బెల్జియం కంపెనీ కొర్నెండాంక్, గ్రీన్ పార్క్ హోటల్స్, ఫెర్న్ హోటల్స్, యూఎస్ఏ కి చెందిన వైల్డ్ ఫ్లవర్ హోటల్స్,బ్రిగేడ్ హోటల్స్, వెల్ నెస్ బ్రాండ్ అయిన ఎలెనా తదితర హోటల్స్ గ్రూప్స్ ప్రతినిధులతో ప్రత్యేకంగా చర్చించారు. ఈ నేపథ్యంలో సింగపూర్ కు చెందిన ఆస్కాట్ గ్రూప్ తమ సిటాడైన్స్ హోటళ్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టైర్ 2,3 నగరాల్లో నెలకొల్పేందుకు ఆసక్తిని కనబరిచారు. అకార్ హోటల్స్ ప్రతినిధులు రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రధాన కేంద్రాల్లో ఐబిస్ బ్రాండెడ్ హోటళ్లను ఏర్పాటు చేయాలని భావించింది. బ్రిగేడ్ హోటల్స్ యాజమాన్యం విశాఖపట్నం, తిరుపతి, హార్స్ లీ హిల్స్ లో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలత వ్యక్తం చేసింది.
మొత్తంగా రెండు రోజుల ముంబయి పర్యటనలో మంత్రి కందుల దుర్గేష్ బృందం దాదాపు 45 ప్రఖ్యాత సంస్థలతో సమావేశమైంది. ఈ సందర్భంగా పీపీపీ విధానంలో పర్యాటకాభివృద్ధి చేయాలని సంకల్పించామని ఈ క్రమంలో రాష్ట్ర పర్యాటక, ఆతిథ్య రంగంలో పెట్టుబడులు పెట్టి పర్యాటక అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఇన్వెస్టర్లను ఆహ్వానించారు. పెట్టుబడిదారులకు మెరుగైన రాయితీలు, ప్రోత్సాహకాలను కల్పించి ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని భరోసానిచ్చారు. అదే విధంగా రాష్ట్రంలోని ప్రముఖ గమ్యస్థానాలు, పెట్టుబడుల కోసం ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్న ప్రదేశాలు, అందుబాటులో ఉన్న కనెక్టివిటీ, ప్రోత్సాహకాలు, సింగిల్ విండో క్లియరెన్స్, రాష్ట్ర పర్యాటక ప్రత్యేకతలు తదితరాల అంశాలను స్పష్టంగా వివరించారు.

ఇన్వెస్టర్లతో మంత్రి కందుల దుర్గేష్ ఇంకా ఏమన్నారంటే వైజాగ్, తిరుపతి, శ్రీశైలం పిచ్చుకలంక, అరకు, అమరావతి మరియు కొత్తగా చేపట్టబోయే పర్యటక ప్రాంతాల్లో హోటల్స్, రిసార్ట్స్ నెలకొల్పాలని కోరారు. ప్రస్తుతం చేపట్టిన పర్యటక ప్రాజెక్టులకు సంబంధించిన నిర్వహణపై దృష్టిపెట్టాల్సిన అవసరాన్ని వ్యక్తపరిచారు. ప్రఖ్యాత బ్రాండ్లతో ఇన్వెస్టర్లను అనుసంధానించాల్సిన అవసరాన్ని వెల్లడించారు. విశాఖపట్నం, తిరుపతిలో పర్యాటక ప్రాజెక్టులకు అవసరమైన భూమిని గుర్తించామన్నారు. గోల్ప్ రిసార్ట్ ల కోసం బెంగుళూరు- అనంతపురం జాతీయ రహదారిపై భూమి అందుబాటులో ఉందన్నారు. ఇన్వెస్టర్లు సైట్ సందర్శన చేసేందుకు గూగుల్ లో సంబంధిత సమాచారం పొందుపరచడమే గాక, క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం ఉండేలా ఎస్టేట్ బృందాన్ని నియమించామని వెల్లడించారు.
పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సమక్షంలో విశాఖపట్నంలో 117 గదుల హోటల్ నిర్మాణం కోసం మైనర్ హోటల్స్ మరియు సన్‌రే రిసార్ట్‌ల మధ్య కీలక అవగాహన ఒప్పందం జరిగింది. ఇరు సంస్థలు సంతకాలు చేసుకున్నాయి. ఈ సంస్థలు రాష్ట్రంలో పర్యావరణ అనుకూల లగ్జరీ రిసార్ట్స్ ఏర్పాటు చేయనున్నాయి.
తొలిరోజు మారియట్, ఐహెచ్ జీ, ఐహెచ్ సీఎల్, అకార్, చాలెట్, ఇమాజికా వరల్డ్ ఎంటర్ టైన్ మెంట్ లిమిటెడ్, హమా, బీఎన్ కే గ్రూప్, వెంటివ్ హాస్పిటాలిటీ, పార్క్ హోటల్స్, లెమన్ ట్రీ, వెస్టిన్, బ్లాక్‌స్టోన్, హిల్టన్,సుబా హోటల్స్, ది బీచ్ ఎహెచ్ఎస్, అంబుజా నోటియా, ఎస్ఆర్ టీ హోటల్స్, రాయల్ ఆర్కిడ్ వంటి తదితర జాతీయ, అంతర్జాతీయ ప్రఖ్యాత సంస్థలతో భేటీ అయిన బృందం రెండో రోజు మరింత ఉత్సాహంతో ఆతిథ్య రంగంలోని కీలక వాటాదారులు, పరిశ్రమల ప్రతినిధులు, హోటల్ పెట్టుబడిదారులు, డెవలపర్లు, ఆపరేటర్లు మరియు దక్షిణాసియా అంతటా ఉన్న ఇతర నిపుణులను కలిసి కీలక అంశాలపై చర్చించారు.