ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల(Tirumala) శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను టీటీడీ(TTD) అనుమతించలేదు. దీంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా ఇతర ప్రజాప్రతినిధులు తమ సిఫార్సు లేఖలను అనుమతించాలని ఏపీ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తూ లేఖలు రాసిన సంగతి తెలిసిందే. అలాగే మీడియా ఎదుట కొంత అసహనం కూడా వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో వారి సిఫార్సు లేఖలను స్వీకరించాలని ఏపీ ప్రభుత్వం టీటీడీకి సూచించింది.
దీంతో మార్చి 23 నుంచి తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను టీటీడీ స్వీకరిస్తోంది. అయితే దర్శనానికి ఒకరోజు ముందు మాత్రమే సిఫార్సు లేఖలకు మాత్రమే అవకాశం కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో తొలి రోజే పెద్ద ఎత్తున సిఫార్సు లేఖలు అందాయి. ఆదివారం ఒక్క రోజే 90 మంది ప్రజా ప్రతినిధులు ఈ సిఫార్సు లేఖలను జారీ చేశారు. ఈ సిఫార్సు లేఖలను స్వీకరించిన టీటీడీ అధికారులు ఇవాళ ఉదయం వారికి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించారు.