TTD adulterated ghee case dharma reddy turns approver: గత ప్రభుత్వంలో తిరుమల శ్రీవారి కల్తీ లడ్డు వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో అసలు సూత్రధారులు, పాత్రధారులు ఒక్కొక్కరిగా బయటపడుతున్నారు. తాజాగా, కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ అదనపు ఈవో ధర్మా రెడ్డి సీబీఐకి అప్రూవర్‌గా మారారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో అప్పట్లో ఏం జరిగిందో సవివరంగా సిట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. వైసీపీ పాలనలో టీటీడీ పాలకమండలి చైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి ఒత్తిడి వల్లే అవన్నీ జరిగినట్టు అంగీకారించారు. అంతేకాదు, లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై సీబీఐ సిట్‌కు ధర్మారెడ్డి కీలక సమాచారాన్ని అందించారు. కల్తీ నెయ్యిని సరఫరా చేసిన బోలెబాబా సంస్థకు కాంట్రాక్ట్ అప్పగించే విషయంలో వైవీ సుబ్బారెడ్డి తమపై అన్ని విధాల ఒత్తిడి చేయించాడని, టీటీడీ చైర్మన్ హోదాలో సుబ్బారెడ్డి ఒత్తిడి చేయడంతో అర్హత లేని బోలె బాబా సంస్థతో అయిష్టంగానే నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ కుదుర్చుకున్నామని సీబీఐ వాంగ్మూలంలో పేర్కొన్నాడు. బోలెబాబా సంస్థ సరఫరా చేసింది కల్తీ నెయ్యి అని తెలిసినప్పటికీ ఏమీ చేయలేకపోయామని సిట్ ఎదుట ధర్మారెడ్డి వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు దగ్గరి బంధువు అయిన వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్న సమయంలో నెయ్యి కల్తీ కావడం అప్పట్లో సంచలనంగా మారింది. నాటి ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ, హిందూ సంఘాలు ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి. ఎట్టకేలకు, ఇప్పుడు ఒక్కొక్క విషయం బయటపడుతుండటంతో రాజకీయంగా ఏపీ రాష్ట్రంలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
Read Also: https://teluguprabha.net/career-news/upsc-mains-2025-results-release-check-on-official-website/
హిందూ సంఘాల ఆగ్రహం.. డిఫెన్స్‌లో పడ్డ వైసీపీ..!
ఈ కేసుపై విచారణ జరుపుతున్నది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని సీబీఐ కావడంతో.. దర్యాప్తు సంస్థపై నిందలు మోపాలేని దుస్థితిలో వైఎస్సార్సీపీ పడిపోయింది. కల్తీ నెయ్యి సుబ్బారెడ్డి వల్లే జరిగిందని తేలిపోవడంతో.. ప్రపంచ వ్యాప్తంగా టీటీడీ భక్తులనుండి ఎదురయ్యే ఆగ్రహాన్ని ఎదుర్కోవడం ఎలా అనే ఆందోళనలో వైసీపీ డిఫెన్స్‌లో పడిపోయినట్లు తెలుస్తోంది. ఈ అపచారం మూటగట్టుకోవడంతో హిందూ సంఘాల నుంచి ప్రతిఘటన ఎదుర్కోక తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంలో వరుసగా రెండవ రోజు సీబీఐ సిట్ విచారణ కొనసాగుతోంది. తిరుపతి అలిపిరి కేంద్రంలో సిట్ కార్యాలయానికి టీటీడీ మాజీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి, బోలెబాబా డైరెక్టర్ విపిన్ జైన్, పామిల్ జైన్ వేరువేరుగా విచారణకు హాజరయ్యారు. విచారణలో ధర్మారెడ్డి అప్రూవర్‌గా మారి.. ఈ వ్యవహారానికి సంబంధించి అనేక విషయాలను సిట్‌కు తెలియజేసినట్లు తెలుస్తోంది. టీటీడీ పాలకమండలి చైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి అప్పట్లో ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింగాల్‌ను ఉపయోగించుకుని కల్తీ నెయ్యికి కారణమైనట్టు ధర్మారెడ్డి బాంబు పేల్చారు.


