TTD employee promotions : శ్రీవారి సేవలో తరిస్తున్న వేలాది మంది టీటీడీ ఉద్యోగులకు, నిరుద్యోగులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి తీపి కబురు అందించింది. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కొత్త పోస్టుల భర్తీకి, ఉద్యోగుల ప్రమోషన్లకు, సర్వీస్ నిబంధనల సవరణలకు ఎట్టకేలకు ఆమోదముద్ర వేసింది. గోశాల నుంచి బర్డ్ ఆసుపత్రి వరకు, వివిధ విభాగాల్లో తీసుకున్న ఈ కీలక నిర్ణయాలు, సంస్థ పనితీరును మెరుగుపరచడంతో పాటు, అనేకమందికి ఉపాధి, ఉన్నతికి మార్గం సుగమం చేయనున్నాయి. టీటీడీ పాలకమండలి డిసెంబర్ 16న జరిగిన సమావేశంలో, పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనలను తుది ఉత్తర్వుల కోసం ప్రభుత్వానికి పంపనున్నారు.
కీలక నిర్ణయాలు.. విభాగాల వారీగా
ఎస్వీ గోశాలలో కొత్త కొలువులు: శ్రీవారి ఆవుల సేవ, గోసంరక్షణను మరింత పటిష్ఠం చేసేందుకు, ఎస్వీ గోసంరక్షణశాలలో 12 కొత్త పోస్టులను సృష్టించారు. అసిస్టెంట్ డైరెక్టర్ (2), గోశాల మేనేజర్ (2), డైరీ సూపర్‌వైజర్ (6), డైరీ అసిస్టెంట్ (2). ఈ పోస్టులకు పాలిటెక్నిక్ (యానిమల్ హస్బెండరీ)తో పాటు, వెటర్నరీ అసిస్టెంట్‌గా 5 ఏళ్ల అనుభవం తప్పనిసరి.
వైద్య విభాగంలో ప్రమోషన్లకు మోక్షం: 30 ఏళ్లుగా ఒకే హోదాలో పనిచేస్తూ, ప్రమోషన్లు లేక స్తబ్దుగా ఉన్న వైద్య సిబ్బందికి తీపి కబురు. ఆధునిక వైద్య పరికరాల నిర్వహణ కోసం, ‘రేడియోగ్రాఫర్’ పోస్టును ‘చీఫ్ రేడియోగ్రాఫర్’గా, ‘ఫిజియోథెరపిస్ట్’ పోస్టును కూడా ఉన్నత హోదాకు అప్‌గ్రేడ్ చేశారు.
ఆలయ కైంకర్యాల్లో మార్పులు:
తాళ్లపాక కైంకర్యపరుడు: ఈ పోస్టుకు, తాళ్లపాక సంకీర్తనల్లో ప్రావీణ్యం ఉన్న సర్టిఫికెట్ తప్పనిసరి చేశారు. కైంకర్యపరుడు, మణ్యం దార్ పోస్టులకు వంశపారంపర్య హక్కులు కల్పించాలన్న విజ్ఞప్తులను, 1987 చట్టం ప్రకారం బోర్డు తిరస్కరించింది.
బర్డ్, ఆయుర్వేద ఫార్మసీలో సవరణలు:
బర్డ్ ఆసుపత్రి: రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ పోస్టుకు ఆర్థోపెడిక్స్ లేదా అనస్థీషియాలో పీజీ డిగ్రీ/డిప్లొమాను అర్హతగా నిర్ణయించారు.
ఆయుర్వేద ఫార్మసీ: ప్రొడక్షన్ సూపర్‌వైజర్ పోస్టుకు బీఏఎంఎస్ లేదా బి.ఫార్మసీ (ఆయుర్వేద)తో పాటు రెండేళ్ల అనుభవాన్ని తప్పనిసరి చేశారు.
చెల్లని పట్టాలపై ఉద్యోగుల ఆవేదన : ఇదిలా ఉండగా, గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు, టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాల పేరుతో పంపిణీ చేసిన పట్టాలు, కనీసం తుడా (TUDA) అనుమతి కూడా లేని ‘చెల్లని పట్టాలని’, తమను ఓట్ల కోసం మోసం చేశారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

