తిరుమల(Tirumala)శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం(Vaikunta Dwara Darshanam) నేపథ్యంలో భక్తులకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు(BR Naidu) కీలక విజ్ఞప్తి చేశారు. జనవరి 10, 11, 12 తేదీల్లోనే స్వామివారిని దర్శించుకోవాలని అనుకోవద్దని సూచించారు. జనవరి 10 నుంచి 19 వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంటాయని..ఈ నెల 19 లోపు ఎప్పుడైనా శ్రీవారిని దర్శించుకోవచ్చని తెలిపారు. టోకెన్లు త్వరగా తీసుకోవాలన్న ఆత్రుతలో తోపులాట వద్దని కోరారు.
వైకుంఠ ఏకాదశి టోకెన్లు జారీ చేయనున్న కేంద్రాల్లో ఏర్పాట్లు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సమీక్ష చేపడుతున్నానని వివరించారు. సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తున్నామని స్పష్టంచేశారు. సామాన్య భక్తులకు అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తున్నామని వీఐపీలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడంలేదని ఆయన వెల్లడించారు. కాగా ఈ నెల 9వ తేదీ ఉదయం 5.30 గంటలకు కౌంటర్ల ద్వారా వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్ల జారీ చేయనున్నారు. తిరుపతిలోని 9 కేంద్రాల్లో 91 కౌంటర్లలో టోకెన్లు ఇవ్వనున్నారు.