తిరుపతి(Tirupati)లో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందడం బాధాకరమని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు(BR Naidu) తెలిపారు. తొక్కిసలాటపై బీఆర్ నాయుడుతో సీఎం చంద్రబాబు(CM Chandrababu) టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక సెంటర్‌లో మహిళా భక్తురాలు అపస్మారక స్థితికి చేరుకుందన్నారు. దీంతో డీఎస్పీ గేట్లు తీయడంతో ఒక్కసారిగా భక్తులు లోపలికి రావడంతో తొక్కిసలాట చోటుచేసుకుందని చెప్పారు. క్షతగాత్రులకు రుయా, స్విమ్స్ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు.
అధికారుల వైఫల్యంతోనే ఇటువంటి సంఘటన చోటు చేసుకుందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పుకొచ్చారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారని ఆయన వివరించారు. తిరుపతిలో పరిస్థితిని ఈవో జె.శ్యామలరావు, కలెక్టర్ వెంకటేశ్వర్ పర్యవేక్షిస్తున్నారని.. ఈ ఘటనలో ఎటువంటి కుట్ర లేదని స్పష్టం చేశారు.