తిరుమల(Tirumala) పుణ్యక్షేత్రాన్ని నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించాలని కోరుతూ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడికి టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు(BR Naidu) లేఖ రాశారు. ఆగమశాస్త్రం, ఆలయ పవిత్రత, భద్రతతో పాటు భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకోవాలని అభ్యర్థించారు. తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలు, ఇతర హెలికాఫ్టర్లు ఎగరడంతో ఆలయం చుట్టూ ఉన్న పవిత్రమైన వాతావరణానికి భంగం కలుగుతోందన్నారు. తిరుమల సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడటానికి నో-ఫ్లైజోన్ ప్రకటన ముఖ్యమైనదని విజ్ఞప్తి చేశారు. ఈ లేఖపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు.
కాగా కోట్లాది మంది హిందూవులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల పుణ్యక్షేత్రంలో ఇటీవల తరుచుగా విమానాలు ఎగురుతున్న సంగతి తెలిసిందే. దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగమశాస్త్రం ప్రకారం తిరుమలలో విమానాలు ఎగరకూడదని పండితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ కేంద్రానికి లేఖ రాశారు.